T20 World Cup 2026: ఇండియా, ఆస్ట్రేలియా కాదు.. వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే: దిగ్గజ క్రికెటర్ జోస్యం

T20 World Cup 2026: ఇండియా, ఆస్ట్రేలియా కాదు.. వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే: దిగ్గజ క్రికెటర్ జోస్యం

2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. వరల్డ్ కప్ కు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే టీమిండియాతో పాటు దాదాపు అన్ని జట్లు వరల్డ్ కప్ కు తమ స్క్వాడ్ ను ప్రకటించేశాయి. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి 20 జట్లు పోటీ పడుతుండడంతో ఈ మెగా టోర్నీకి భారీ హైప్ నెలకొంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఈ మెగా టోర్నీలో ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నాయి. 

2026 టీ20 వరల్డ్ కప్ ఇండియా లేదా ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ గెలుచుకుంటుందని భావిస్తుంటే ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ వాన్ జోస్యం ప్రస్తుతం వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్ ముందు మైకేల్ వాన్ మాట్లాడుతూ వరల్డ్ కప్ గెలిచే జట్టును చెప్పి కొంచెం ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాగా టీమిండియాకు షాక్ ఇచ్చి వన్డే సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకున్న న్యూజిలాండ్ జట్టు వరల్డ్ కప్ గెలవగలదని వాన్ అభిప్రాయపడ్డాడు. వాన్ ఎక్స్ లో ఇలా రాసుకొచ్చాడు. "న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ గెలవొచ్చు. ఆ జట్టులో ఎప్పుడూ బలమైన ప్లేయర్స్ ఉంటారు. ఈ సారి వరల్డ్ కప్ కొడుతుంది". అని వాన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. 

ఈ సారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో  భాగం కానున్నాయి. భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.