టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్ళీ ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో కనిపిస్తారో అని ఫ్యాన్స్ ఎదురు చూపులు చూస్తున్నారు. రోకో జోడీ సూపర్ ఫామ్ లో ఉండడంతో వీరి ఆటను చూడడానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఒకటే ఫార్మాట్ ఆడడంతో వన్డే షెడ్యూల్ పై ఎదురు చూడాల్సిన పరిస్థితి. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ ను ఇండియా 1-2 తేడాతో ఓడిపోయింది. ఆదివారం (జనవరి 18) ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కివీస్ తో సిరీస్ ముగిశాక ఇండియా తర్వాత వన్డే షెడ్యూల్ ఏంటో ఫ్యాన్స్ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు.
ఇండియా తర్వాత వన్డే షెడ్యూల్ జూలై లో ఇంగ్లాండ్ తో ఆడాల్సి ఉంది. భారత క్రికెట్ జట్టు 2026లో వైట్-బాల్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో టూర్ కు వెళ్లనుంది. ఇందులో భాగంగా మొత్తం 8 మ్యాచ్ లు ఆడనుంది. మొదట 5 టీ20 మ్యాచ్ లు ఆ తర్వాత 3 వన్డేలు జరగనున్నాయి. జూలై 14 నుంచి 19 మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. మూడు వన్డేలు బర్మింగ్‌హామ్, కార్డిఫ్, లండన్‌లో జరుగుతాయి. జూలై 4, జూలై 7, జూలై 9, జూలై 11 న వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. మాంచెస్టర్, నాటింగ్ హోమ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా ఈ మ్యాచ్ లు జరుగుతాయి.
ప్రస్తుతం ఇండియా న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడడానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి లో టీ20 వరల్డ్ కప్ జరగుతుంది. మార్చ్ నుంచి మే వరకు ఐపీఎల్ లో ప్లేయర్స్ బిజీ కానున్నారు. ఐపీఎల్ తర్వాత 2026 జూన్ లో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఉన్నట్టు చర్చలు నడుస్తున్నాయి. అయితే వీటి గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. జూలై లో ఇంగ్లాండ్ తో ఇండియా తమ తదుపరి సిరీస్ ఆడడం ఖాయంగా మారింది. అంటే కోహ్లీ, రోహిత్ ను చూడడానికి మరో 6 నెలల పాటు ఆగాల్సిందే.
ఇటీవలే న్యూజిలాండ్ తో ముగిసిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టులేకపోయాడు. మూడు మ్యాచ్ ల్లో వరుసగా 26, 24, 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే సమయంలో కోహ్లీ మాత్రం అద్భుతంగా రాణించాడు. సిరీస్ తొలి మ్యాచ్ లో కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో 29 బంతుల్లో 23 పరుగులకు ఔటయ్యాడు. ఆదివారం (జనవరి 18) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో 108 బంతుల్లో 124 పరుగులు చేశాడు. ఓవరాల్ గా మూడు మ్యాచ్ ల్లో 80 యావరేజ్ తో 240 పరుగులు చేశాడు.
ఇండియా, ఇంగ్లాండ్ 2026 వన్డే, టీ20 షెడ్యూల్:
జూలై 14: మొదటి వన్డే - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్, సాయంత్రం 5:30
జూలై 16: రెండవ వన్డే - సోఫియా గార్డెన్స్, కార్డిఫ్, సాయంత్రం 5:30
జూలై 19: మూడవ వన్డే - లార్డ్స్, లండన్, మధ్యాహ్నం 3:30
టీ20 సిరీస్ షెడ్యూల్:
జూలై 1: మొదటి టీ20 – బ్యాంక్స్ హోమ్స్ రివర్‌సైడ్, డర్హామ్, రాత్రి 11 గంటలకు
జూలై 4: 2వ టీ20 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్, రాత్రి 7 గంటలకు
జూలై 7: 3వ టీ20 – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్, రాత్రి 11 గంటలకు
జూలై 9: 4వ టీ20 - సీట్ యునిక్ స్టేడియం, బ్రిస్టల్, రాత్రి 11 గంటలు
జూలై 11: 5వ టీ20 – యుటిలిటా బౌల్, సౌతాంప్టన్, రాత్రి 11 గంటలు
