10 నిమిషాల్లో 100 బాంబులు..లెబనాన్లో ఇజ్రాయెల్ భీకర దాడులు.. వంద చోట్ల అటాక్స్

10 నిమిషాల్లో  100 బాంబులు..లెబనాన్లో ఇజ్రాయెల్ భీకర దాడులు.. వంద చోట్ల అటాక్స్
  • 254 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు
  • లెబనాన్​లో ఇజ్రాయెల్ భీకర దాడులు.. వంద చోట్ల అటాక్స్
  • పేరుకే కాల్పుల విరమణ.. ఆగని యుద్ధం 
  • యూఏఈ, కువైట్, బహ్రెయిన్​పై ఇరాన్ దాడులు

టెహ్రాన్: రెండు వారాలపాటు కాల్పుల విరమణ పాటిస్తున్నామంటూ అమెరికా, ఇరాన్ ప్రకటించినప్పటికీ దాడులు, ప్రతిదాడులు మాత్రం యథావిధిగా కొనసాగాయి. బుధవారం ఉదయం రెండు వైపులా సీజ్ ఫైర్ ప్రకటనలు వెలువడిన కొన్ని గంటలకే మళ్లీ దాడులు జరిగాయి. ఇరాన్ లవన్ ద్వీపంలోని చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరగడంతో మంటలు చెలరేగాయని, సిరి ద్వీపంలో కూడా పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. 

దీనికి బదులుగా ఇరాన్ కూడా యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై మిసైల్స్, డ్రోన్ లతో పెద్ద ఎత్తున దాడులు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్​పై బాంబుల వర్షం కురిపించింది. కేవలం 10 నిమిషాల్లోనే 100 చోట్ల బాంబుదాడులు చేసింది. ఈ దాడుల్లో బుధవారం ఒక్కరోజే 254 మంది మృతిచెందారని, 7 వందల మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నామని యూఏఈ తెలిపింది. 

బుధవారం తెల్లవారుజామున క్షిపణి శకలాలు పడటంతో మంటలు చెలరేగడంతో అబుదాబిలోని హబ్షన్ గ్యాస్ కాంప్లెక్స్‌‌లో కార్యకలాపాలను కొద్దిసేపు నిలిపివేశారు. కువైట్​లో కూడా ఉదయం నుంచి ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. కీలకమైన చమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు కువైట్ సైన్యం తెలిపింది. బహ్రెయిన్‌‌లో డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు గాయపడ్డారని, పలు ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. 

కాగా, బుధవారం లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ దళాలు ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడులకు తెగబడ్డాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన అత్యంత తీవ్రమైన బాంబు దాడుల పరంపర ఇదే కావడం గమనార్హం.