
పంజాగుట్ట, వెలుగు: సిటీలోని పబ్బుల్లో డ్రగ్ కల్చర్ పెరిగిపోవడంతో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఏరియాల్లోని పలు పబ్బులపై దాడులు చేశారు. తొలిసారి పబ్బుల్లో స్నిపర్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించడం గమనార్హం. సిటీ పోలీస్ కమిషనర్ గా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫోకస్ చేసి పలు పబ్బుల్లో దాడులు నిర్వహిస్తున్నారు. యువత పబ్బుల్లో గంజాయి, డ్రగ్స్ సేవిస్తూ బానిసలుగా మారుతుండగా.. తనిఖీలతో పబ్‌ల నిర్వాహకులకు బెంబేలెత్తిపోయారు.
న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండగా పబ్స్‌లో విస్తృతంగా మాదకద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగబోతున్నాయని వచ్చిన సమాచారంతో తనిఖీలు చేశారు. పక్కా సమాచారంతో ప్రధానంగా మూడు పబ్బుల్లో పోలీసులు తనిఖీలు చేయగా అనంతరం పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్10, 36, 45 ఏరియాల్లోని పబ్స్ పై పోలీసులు పక్కా సమాచారంతో ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు దాడులు చేస్తున్నట్టు తెలిసింది.