- రాత్రివేళల్లోనే ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్లు
- నిద్రమత్తులో అదుపు తప్పుతున్న వాహనాలు
- తెల్లవారుజామున డ్రైవింగ్ మరింత డేంజర్
మంచిర్యాల, వెలుగు: నిద్రమత్తు, ఓవర్ స్పీడ్, డ్రంకన్‌డ్రైవ్ వంటి కారణాల వల్ల ఘోర ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. వాహనదారులు, డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండడం వల్ల వెహికల్స్ అదుపు తప్పడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో నైట్ టైమ్‌లో జర్నీలు చేస్తున్నారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత లాంగ్ జర్నీ చేయడం వల్ల డ్రైవర్లు అలసిపోయి నిద్రమత్తులోకి జారుకోవడంతో స్టీరింగ్‌పై కంట్రోల్ తప్పుతున్నారు.
దీంతో వాహనాలు డివైడర్లను, రోడ్డు పక్కనున్న కల్వర్టులను లేదా ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొడుతున్నారు. దీంతో వాహనాల్లో ప్రయాణిస్తున్నవారి నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4.30 గంటల మధ్య జర్నీ మరింత డేంజర్ అని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కాళ్లు, చేతులు విరిగిపోయి వైకల్యం బారిన పడుతున్నారు. ఇతర శరీర భాగాలు దెబ్బతిని బాధితులు మంచానికే పరిమితమవుతున్నారు. అలాంటి వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది.
హైవేలపైనే అధికం..
నైట్ జర్నీల కారణంగా హైవేలపైనే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా మీదుగా ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 63, ఎన్‌హెచ్ 363తో పాటు హైదరాబాద్ టూ మంచిర్యాల రాజీవ్ రహదారి నిత్యం యాక్సిడెంట్లతో నెత్తురోడుతున్నాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల నుంచి రోజూ వేలాది మంది వివిధ పనులకు హైదరాబాద్వెళ్తుంటారు. చాలామంది సెల్ప్ డ్రైవింగ్ చేస్తూ ఉదయమే బయల్దేరి మధ్యాహ్నం హైదరాబాద్ రీచ్ అవుతారు.
అక్కడ సాయంత్రం వరకు పనులు చూసుకొని నైట్ డిన్నర్ అనంతరం రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసి తెల్లవారుజామున గమ్యం చేరుకుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రమత్తు ముంచుకొస్తున్నా ఆగకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసులు 'అరైవ్... అలైవ్' ప్రోగ్రాం ద్వారా ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు.
మరికొన్ని ఘటనలు..
- ఇటీవల మహారాష్ర్టలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన వలస కూలీలు బొలెరోలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు వరినాట్ల కోసం వెళ్తూ తెల్లవారుజామున 3 గంటలకు మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డు దగ్గర రోడ్డు పక్కన ఆగారు. వెనుకనుంచి స్పీడ్‌గా వచ్చిన లారీ డ్రైవర్ నిద్రమత్తు వల్ల అదుపుతప్పి బొలెరోను ఢీకొన్నది. ఈ ఘటనలో ముగ్గురు వలస కూలీలు మృతిచెందారు.
- ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడ గ్రామ సమీపంలో గతేడాది డిసెంబర్ 10న అర్ధరాత్రి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నది. అందులో ప్రయాణిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే చనిపోయారు.
- మంచిర్యాల జిల్లాలో 2024లో 402 యాక్సిడెంట్లు జరిగాయి. ఇందులో 123 మంది చనిపోగా, 289 మంది గాయపడ్డారు. 2025లో 429 యాక్సిడెంట్లలో 132 మంది ప్రాణాలు కోల్పోగా, 170 మందికి గాయాలయ్యాయి.
మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజీ రోడ్‌కు చెందిన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు ఈ నెల 15న హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. 17న రాత్రి తిరిగి వస్తూ కరీంనగర్లో ఎంబీబీఎస్ చదువుతున్న కూతురును కాలేజీలో డ్రాప్ చేశారు. అక్కడినుంచి బయల్దేరి వస్తుండగా బసంత్‌నగర్ బస్టాండ్ దాటిన తర్వాత కారు అదుపు తప్పి రాజీవ్ రహదారిపై కల్వర్టును ఢీకొన్నది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్, రజిత స్పాట్లోనే చనిపోయారు. ఈ ప్రమాదం గత మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఇలా అర్దరాత్రి ప్రయాణాలు తరచూ యాక్సిడెంట్లకు దారితీస్తూ ప్రాణసంకటంగా మారుతున్నాయి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు..
డ్రైవర్లకు నిద్రమత్తు ఆవరిస్తే వెహికల్‌ను పక్కకు ఆపి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. నైట్‌లో ట్రాఫిక్ లేకపోవడంతో రోడ్లు ఖాళీగా ఉన్నాయని ఓవర్ స్పీడ్ వెళ్లకూడదు. మద్యం తాగి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరం. వెహికల్ లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. లాంగ్ జర్నీల్లో ప్రతీ గంటర్నర, రెండు గంటలకు ఓసారి ఐదు పది నిమిషాలు ఆగాలి. ఫేస్ వాష్ అండ్ గో'విధానం పాటించాలి. రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు. అత్యవసరమైతే తప్ప నైట్ జర్నీలు చేయకపోవడమే మంచిది.
