యాపిల్ తోటలు, ఇండ్లు వదిలి జమ్మూకు పండిట్​ల వలస

యాపిల్ తోటలు, ఇండ్లు వదిలి జమ్మూకు పండిట్​ల వలస

శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్​లోని చౌదరీ గుండ్​లో కొద్దిరోజుల కిందటి వరకూ 8 హిందూ కుటుంబాలు, 25 ముస్లిం కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఆ ఊర్లో హిందువులెవరూ లేరు. ఆ ఊర్లోని చివరి కాశ్మీరీ పండిట్ డాలీ కుమారి కూడా గురువారం జమ్మూకు వలస వెళ్లిపోయారు. ఆమె సోదరుడు అంతకుముందే తన తోటను, ఇంటిని వదిలి వలసపోయారు. ‘‘అన్నింటినీ వదిలేసి జమ్మూలోని మా చుట్టాల ఇంటికి వెళ్తున్నా. నేను ఇక్కడికి మళ్లీ వస్తానో, లేదో తెలియదు. పూర్తి సేఫ్ అని అనుకుంటే వస్తానేమో. కానీ ఇప్పట్లో అయితే రాను. మా కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నరు. మేం చేసిన తప్పేంటి? మా పరిస్థితిని తలుచుకుని ఏడవని రోజంటూ లేదు. ఇలాంటి పరిస్థితిలో మేం ఈ ఊర్లో ఎలా ఉండగలం?” అని డాలీ కుమారి ప్రశ్నిస్తున్నారు. ‘‘మేం వదులుకుని వచ్చినవన్నీ మాకు ఎంతో విలువైనవి. కానీ ప్రాణ భయంతో వదులుకొని రాక తప్పలేదు’’ అని ఇటీవలే జమ్మూకు షిఫ్ట్ అయిన మరో పండిట్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా.. ఉన్న ఊరిని, సొంత ఇంటిని, భూములను, తోటలను వదులుకుని ఉన్నపళంగా వెళ్లిపోవడమంటే ఎవరికైనా మనసొప్పదు. కానీ.. కాశ్మీర్ లో పండిట్​లను, వలస కూలీలను, హిందూ మైనార్టీలను టెర్రరిస్టులు టార్గెట్ చేసి చంపుతుండటంతో ‘బతికుంటే చాలు.. దేవుడా!’ అనే దుర్భర పరిస్థితిలో ఉన్న పండిట్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జమ్మూకు వలస వెళ్తున్నారు.

టార్గెట్ కిల్లింగ్స్​తో భయం భయం 

చౌదరీ గుండ్ కు చెందిన యాపిల్ రైతు పూరణ్​ కిషన్ భట్ ను ఈ నెల 15న టెర్రరిస్టు లు ఆయన ఇంటి వద్దే కాల్చిచంపారు. జిల్లా హెడ్ క్వార్టర్ కు 6 కిలోమీటర్ల దూరంలోని చౌదరి గుండ్ లో సీఆర్పీఎఫ్ క్యాంపుకు వంద మీటర్ల దూరంలోనే ఉన్నా.. ఆయన ప్రాణాల కు రక్షణ లేకుండా పోయింది. ఈ నెల 18న హర్మైన్ గ్రామంలో ఇద్దరు వలస కూలీలను టెర్రరిస్టులు చంపారు. అంతకుముందు ఆగస్టులో చొట్టిగాం గ్రామంలో జరిగిన కాల్పుల్లో ఓ కాశ్మీరీ పండిట్ చనిపోగా మరొకరు గాయపడ్డారు. ఇలా వరుసగా టార్గెట్ కిల్లింగ్స్ జరుగుతుండటంతో తమ భద్రతపై తీవ్ర ఆందోళనలో మునిగిన పండిట్ కుటుంబాలు సర్వస్వం వదులుకుని వలస వెళ్తున్నాయి.