కాంగ్రెస్​కు మిలింద్ దేవరా రాజీనామా

కాంగ్రెస్​కు మిలింద్ దేవరా రాజీనామా

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత మిలింద్ దేవ్​రా ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభించిన రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. మిలింద్ దేవ్​రా రాజీనామా చేసిన తర్వాత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. ఆదివారం ఈ మేరకు ట్వీట్ చేశారు. “నా రాజకీయ ప్రయాణంలో నేటితో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది.

కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేశాను. ఆ పార్టీతో మా కుటుంబానికి ఉన్న ఐదు దశాబ్దాల బంధాన్ని ముగించాను. గత కొన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలు, సహచరులు, నాయకులందరికి కృతజ్ఞతలు” అని తెలిపారు. అనంతరం సిద్ధి వినాయకుని ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. షిండే నేతృత్వంలోని శివసేనలో ఆయన చేరారు. ఈ సందర్భంగా తాను అభివృద్ధి బాటలో నడుస్తానని పేర్కొన్నారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

అసంతృప్తితోనే రాజీనామా 

మిలింద్ దేవ్​రా గతంలో ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.  రాబోయే లోక్ సభ ఎన్నికల్లోను ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ, 2019లో ఈ స్థానం నుంచి అరవింద్ సావంత్ గెలుపొందగా, మిలింద్ దేవ్​రా రెండో స్థానంలో నిలిచారు. అందువల్ల ఈ స్థానాన్ని తమకు కేటాయించాలని ఇండియా కూటమిలో భాగమైన ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన  అడుగుతోంది.

కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం శివసేనకే వెళ్లే అవకాశం ఉంది. దీనిపై మిలింద్ దేవ్​రా అసంతృప్తి వ్యక్తంచేశారు. అందువల్లే మిలింద్ దేవ్​రా కాంగ్రెస్​కు రాజీనామా చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.