
మహారాష్ట్రలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో తెలిపారు. పార్టీతో తన కుటుంబానికున్న 55 ఏళ్ల అనుబంధం ముగిసిందని, ఇన్నేళ్లు నాకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, సహచరులకు ధన్యవాదాలు అని ట్విట్టర్ లో దేవరా పోస్ట్ చేశారు.
మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. మురళీ దేవ్‌రా కుమారుడే మిలింద్. ముంబై సౌత్ నుంచి 2004, 2009లో ఎంపీగా గెలిచారు. 2012లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014,19 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజా సమాచారం ప్రకారం మిలింద్ దేవరా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు షిండే వర్గంలో చేరనున్నారని సమాచారం.
ప్రస్తుతం కాంగ్రెస్-శివసేన (ఉద్ధవ్ వర్గం) కూటమిలో భాగంగా దక్షిణ ముంబయి సీటుపై చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉద్ధవ్ వర్గానికి సీటు కేటాయిస్తే టికెట్ దక్కడం కష్టమనే భయాలు మిలింద్‌కున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి.. ఏక్‌నాథ్ శిందే వర్గంలో చేరనున్నారన్న ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ఇవాళ మణిపూర్ లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.