అంగన్వాడీ చిన్నారులకు ప్రతిరోజూ పాలు.. మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు పంపిణీ

అంగన్వాడీ చిన్నారులకు  ప్రతిరోజూ పాలు.. మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు పంపిణీ
  • పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌గా ములుగు జిల్లా 
  • 7,918 మంది పిల్లలకు సాయంత్రం పూట పాలు అందజేత
  • పంపిణీని ప్రారంభించిన  మంత్రి సీతక్క


ములుగు, వెలుగు :
అంగన్‌‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఇప్పటికే కోడిగుడ్లు, బాలామృతం అందజేస్తున్న ప్రభుత్వం తాజాగా పాలను సైతం అందజేసే పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అంగన్‌‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న మూడు నుంచి ఆరేండ్లలోపు చిన్నారులకు ప్రతీరోజు సాయంత్రం 100 ఎంఎల్‌‌ పాలు అందజేయాలని నిర్ణయించింది. పథకం అమలుకోసం ములుగు జిల్లాను పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌గా ఎంపిక చేసింది.

నవంబర్ 6 నుంచే జిల్లాలోని అంగన్‌‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాలను అందజేస్తుండగా.. మంత్రి సీతక్క సోమవారం అధికారికంగా ప్రారంభించారు. తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు పోతుండడంతో పిల్లలకు సరైన పౌష్టికాహారం అందడం లేదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. పాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేస్తామని ప్రకటించారు. 
 

ములుగులో 7,918 మందికి..


అంగన్‌‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా ములుగు జిల్లాలో ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్‌‌ ప్రాజెక్ట్‌‌ పరిధిలోని 7,918 మంది చిన్నారులకు పాలు పంపిణీ చేయనున్నారు. ఇందులో ములుగు ప్రాజెక్ట్‌‌ పరిధిలో 2,316 మంది ఉండగా తాడ్వాయి పరిధిలో 1,557, ఏటూరునాగారం పరిధిలో 2,454, వెంకటాపురం ప్రాజెక్ట్‌‌ పరిధిలోని అంగన్‌‌వాడీ కేంద్రాల్లో 1,591 మంది చిన్నారులు ఉన్నారు. 

గతంలో వీరికి కోడిగుడ్లు, బాలామృతం, తదితర  పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందజేసేవారు. పాలల్లో ఎక్కువ పోషకాలు ఉండడంతో చిన్నారులు వయసుకు తగ్గట్లు ఎత్తు, బరువు పెరిగేందుకు పాలు ఉపయోగపడుతాయన్న వైద్య నిపుణుల సూచన మేరకు పాల పంపిణీకి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం విజయ డెయిరీ నుంచి జిల్లాలోని అంగన్‌‌వాడీ కేంద్రాలకు ప్రతీరోజు 793 లీటర్ల పాలు సరఫరా అవుతున్నాయి. పాల సరఫరాకు సంబంధించి జిల్లా సంక్షేమ అధికారి తుల రవి ఆధ్వర్యంలో అంగన్‌‌వాడీ టీచర్లకు ఇప్పటికే ప్రత్యేక సూచనలు చేశారు. చిన్నారులకు అందాల్సిన పాలు, ఇతర పౌష్ఠికాహారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని ఆదేశించారు.