Tamannaah: మైసూర్ శాండల్ అంబాసిడర్ గా నార్త్ బ్యూటీనా? తమన్నా ఎంపికపై కన్నడిగుల ఆగ్రహం!

Tamannaah: మైసూర్ శాండల్ అంబాసిడర్ గా నార్త్ బ్యూటీనా? తమన్నా ఎంపికపై కన్నడిగుల ఆగ్రహం!

దక్షిణాదిలో మైసూర్ శాండల్ సోప్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.  సాధారణంగా సబ్బుల్లో గంధపు సువాసన కోసం రసాయనాలను ఉపయోగిస్తారు. కానీ దీనిని 100 శాతం స్వచ్ఛమైన సహజ గంధపు చెక్కల నుండి తీసిన నూనెతో తయారు చేస్తారు.  అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ సబ్బు.. ఇప్పడు అంబాసిడర్‌ విషయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ చర్యలపై కన్నగిడులు ఫైర్ అవుతున్నారు.
 
సోప్ తో తారలకు పాపులారిటీ..

దీపికా పదుకొణె, అలియా భట్, కత్రినా కైఫ్, ప్రీతి జింటా.. ఇలా బాలీవుడ్ తారలందరూ ఏదో ఒక సోప్ కమర్షియల్‌లో మెరిసినవారే. హన్సిక, సోనాలీ బింద్రే వంటి వారు ఇప్పటికీ ఆ పాత ప్రకటనల వల్ల గుర్తుండిపోయారు. లేటెస్ట్ గా ఈ జాబితాలోకి 'మిల్కీ బ్యూటీ' తమన్నా భాటియా చేరింది. అయితే, సాధారణంగా ఇలాంటి డీల్స్ కుదిరినప్పుడు ప్రశంసలు వస్తాయి, కానీ తమన్నా విషయంలో మాత్రం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివాదానికి కారణం ఏమిటి?

కర్ణాటక ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తమ ఐకానిక్ 'మైసూర్ శాండల్ సోప్' ప్రచారకర్తగా తమన్నాను నియమించుకుంది. ఫిబ్రవరి 10న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ, ఈ నిర్ణయంపై కన్నడిగులు నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. వందేళ్ల చరిత్ర కలిగిన, కర్ణాటక మూలాలున్న బ్రాండ్‌కు స్థానిక కన్నడ నటిని కాకుండా, తమన్నాను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో అందమైన నటీమణులకు కొదవ ఉందా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. 

►ALSO READ | Upasana : జ్యోతిష్యుడు చెప్పిన ముహూర్తానికే డెలివరీ.. మెగా వారసుల రాకపై ఉపాసన ఎమోషనల్ వీడియో!

 

నెటిజన్ల డిమాండ్..

సోషల్ మీడియాలో చాలామంది ప్రణీత సుభాష్ పేరును సూచిస్తున్నారు. ప్రణీత కర్ణాటకకు చెందిన నటి, పైగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. మైసూర్ శాండల్ సోప్ వంటి సంప్రదాయ బ్రాండ్‌కు ఆమె హోమ్లీ లుక్ సరిగ్గా సరిపోయేది అని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. మరికొందరు రష్మిక, రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, పూజా హెగ్డేవంటి స్థానిక ప్రతిభను ప్రోత్సహించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

 

KSDL వ్యూహం ఏమిటి?

విమర్శలు పక్కన పెడితే, KSDL లక్ష్యం వేరేలా ఉంది.  మైసూర్ శాండల్ సోప్ మార్కెట్‌ను ఉత్తర భారతదేశంలో విస్తరించడంపై దృష్టి పెట్టింది. యువతలో తమన్నాకున్న క్రేజ్‌ను వాడుకుని బ్రాండ్‌ను రీబ్రాండ్ చేయాలని ప్లాన్ చేస్తుంది.2030 నాటికి రూ. 5,000 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని కంపెనీ భావిస్తోంది. 

తమన్నాతో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా గ్లోబల్ బ్రాండ్‌గా ఎదగాలని చూస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా తమన్నా రూ. 6 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఒక వర్గం నెటిజన్లు తమన్నాకు మద్దతుగా నిలుస్తూ, బ్రాండ్ వృద్ధి చెందాలంటే ఇలాంటి గ్లోబల్ ఫేస్ అవసరమని వాదిస్తున్నారు. ఏదేమైనా, 'ఆజ్ కీ రాత్' బ్యూటీ చుట్టూ ఇప్పుడు 'గంధపు' వివాదం ముదురుతోంది.