- మినీ మేడారాలుగా రేకుర్తి, వీణవంక, గోదావరిఖని, కేశవపట్నం, గోయల్‌వాడ, నీరుకుళ్ల, కొదురుపాక, కొలనూరు
- విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు
కరీంనగర్, వెలుగు: ఆదివాసీ వనదేవతలు సమ్మక్క– సారలమ్మ జాతరలకు వేళయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే వేడుకలకు పలు గ్రామాలు, పట్టణాల్లోని అమ్మవార్ల గద్దెలు ముస్తాబవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మినీ మేడారాలుగా ప్రసిద్ధి చెందిన రేకుర్తి, వీణవంక, కేశవపట్నం, హుజూరాబాద్, గోదావరిఖని, గోయల్ వాడ, నీరుకుళ్ల, కొదురుపాక, కొలనూరు తదితర ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిఖనిలో జరిగే జాతరకు సింగరేణి ఉద్యోగులతోపాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఏటా వస్తుంటారు. లక్షలాది మంది భక్తులు తరలిరానుండడంతో సింగరేణి, ఎన్టీపీసీ, రామగుండం బల్దియా ఆధ్వర్యంలో జాతరలో సౌకర్యాలు కల్పిస్తున్నారు.
వీణవంక జాతరకు 50 ఏళ్లు..
కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ ఏడాదితో 50 ఏళ్లు నిండనున్నాయి. మొదటి నుంచి ఈ జాతరను పాడి సుధాకర్ రెడ్డి కుటుంబమే నిర్వహిస్తోంది. ఇటీవల జాతరకు సంబంధించిన భూమిపూజను ఆయన తనయుడు ఉదయనందన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. స్వర్ణోత్సవ జాతర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి జాతరకు రావాలని సీఎంతో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సర్పంచులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులు, ఇతర ప్రముఖులను ఆయన ఆహ్వానించారు.
ఊరూరా జాతరలే..
ఉమ్మడిజిల్లావ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జాతరలతోపాటు గ్రామస్థాయిలోనూ అనేక చోట్ల సమ్మక్క–సారలమ్మ జాతర్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన జాతర్లతోపాటు ఉమ్మడిజిల్లావ్యాప్తంగా మరో 50 చోట్ల జాతరలు జరుగుతాయని అంచనా. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి, చింతకుంట, మల్కాపూర్, రామడుగు మండలం గోపాల్‌రావుపేట, రామడుగు, కొరటపల్లి, గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామాల్లో జాతర నిర్వహణకు గ్రామాల్లో సర్పంచులు, పట్టణాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
జమ్మికుంట మండలం తనుగుల, కేశవపురం, వావిలాలతోపాటు ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లను అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. గన్నేరువరం మండలం మైలారం, గన్నేరువరం, శంకరపట్నం మండలం కేశవపట్నం, ఆముదాలపల్లి, చొప్పదండి మండలంలో చొప్పదండి పట్టణం, ఆర్నకొండ, రాగంపేట, గుమ్లాపూర్, కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల, నగునూర్, బొమ్మకల్, వీణవంక మండలంలో వీణవంక, చల్లూరు, కోర్కల్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో జాతర్ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
