గురుకులాల బువ్వ.. కేసీఆర్ ఎప్పుడైనా తిన్నడా? : మంత్రి అడ్లూరి

గురుకులాల బువ్వ..  కేసీఆర్ ఎప్పుడైనా తిన్నడా? : మంత్రి అడ్లూరి
  • పేద పిల్లల సదువు తిప్పలు ఆయనకేం తెలుసు: మంత్రి అడ్లూరి
  • ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్​ భవిష్యత్ కోసం ​సర్కారు కృషి 
  • పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం అశోక్ నగర్​లో 
  • ఎస్సీ హాస్టల్ నిర్మిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్..​ పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఒక్క చోట కూడా బువ్వ తినలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​విమర్శించారు. సీఎం రేవంత్​ ఇప్పటికే నాలుగైదు సార్లు రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారని తెలిపారు. పేద పిల్లల సదువు తిప్పలు కేసీఆర్​కు తెల్వదని ఆయన పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్ష విషయంలో బట్ట కాల్చి మీద వేయడం సరికాదని, ఆధారాలుంటే మీడియా ముందు బయటపెట్టాలని మంత్రి సవాల్​విసిరారు. 

పేద విద్యార్థుల భవిష్యత్తు​ కోసం రేవంత్​ సర్కారు కృషి చేస్తున్నదని, అనవసరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్​లో మీడియాతో మంత్రి మాట్లాడారు. ఎస్టీ వెల్పేర్​కు సంబంధించి రూ.15.17 కోట్ల పెండింగ్​ వేతనాలు చెల్లించామని మంత్రి తెలిపారు.  రూ.1,600 కోట్లతో 18 చోట్ల ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్స్​కడుతున్నామని, భవన నిర్మాణాలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం గ్రీన్ చాలెంజ్ ద్వారా నిధులు కేటాయించిందన్నారు. షేక్ పేట, ధర్మపురి గురుకులాల్లో రూ.24 లక్షలతో మోడ్రన్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నామని, వీటిని తర్వలోనే ప్రారంభిస్తామన్నారు. 

ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఉద్యోగులను గత ప్రభుత్వం విస్మరించింది

గత బీఆర్​ఎస్​ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఉద్యోగులను విస్మరించిందని మంత్రి విమర్శించారు. తాను ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను సీఎం రేవంత్​ దృష్టికి తీసుకొని వెళ్లగానే సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయడానికి సీనియర్ ఐఏఎస్ సబ్యసాచి ఘోష్ ను వెల్ఫేర్ హాస్టల్స్ కోసం ప్రత్యేక స్పెషల్ సెక్రటరీగా నియమించారని పేర్కొన్నారు. స్కూల్స్, పిల్లల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదని.. సలహాలు, సూచనలు ఇవ్వొచ్చన్నారు. చదువుకుంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం అశోక్ నగర్ ప్రాంతంలో కొత్త ఎస్సీ హాస్టల్ ప్రారంభించాలనే ఆలోచన తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్​తో  హైదరాబాద్ నగరంలో సొంత హాస్టల్​ భవనాలు నిర్మించాలని ప్రయత్నిస్తొందన్నారు. ఎస్సీ, ఎస్టీ శాఖలకు నిధుల కేటాయింపు, స్కాలర్​షిప్​లలో వాటా పెంచాలని కేంద్రాన్ని కోరామని మంత్రి అడ్లూరి వెల్లడించారు.