
- అధికారులకు మంత్రి అడ్లూరి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లోని తన చాంబర్‌నుంచి సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్య సాచి ఘోష్ తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘‘సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సౌలతులు మెరుగుపరచాలి.
పరిశుభ్రమైన వంట గదులతోపాటు తాగునీటి సదుపాయం, పోషకాహారం అందించాలి. ఆహారనాణ్యత, సరఫరా, క్వాలిటీ కంట్రోల్‌పై అధికారుల పర్యవేక్షణ ఉండాలి. జిల్లా ఆఫీసర్లు తరచూ ఆకస్మిక తనిఖీలతో విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించాలి. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు, డిజిటల్ మానిటరింగ్ మెకానిజమ్ ఏర్పాటు చేసి హాస్టళ్ల భద్రతను మరింత పెంచాలి’’ అని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఉన్నతాధికారులు బుద్ధ ప్రకాశ్, క్షితిజా, కృష్ణ ఆదిత్య, సీతాలక్ష్మి, షఫీయుల్లా తదితరులు పాల్గొన్నారు.