- కోచింగ్ సెంటర్లను అకాడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు సివిల్స్‌తో పాటు గ్రూప్1 ర్యాంకులు సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అన్ని రంగాల్లో సమానత్వం లభించాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. బుధవారం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో 59 దళిత కుల సంఘాల నాయకులతో కలిసి హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ భవన్‌ను, కాచిగూడలోని ఎస్సీ హాస్టల్‌ను మంత్రి అడ్లూరి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ భవన్‌ను మోడర్న్ కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. కాచిగూడ హాస్టల్ కాంప్లెక్స్‌ను రెసిడెన్షియల్ అకాడమిక్ సెంటర్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సివిల్స్ కోచింగ్ కొరకు తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి తెలిపారు.
దళిత విద్యార్థులు ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కోచింగ్ తీసుకోవడం ఖర్చుతో కూడిన పని కావడంతో ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్ సౌకర్యాలను హైదరాబాద్‌లోనే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల కోసం కొత్త టెక్నాలజీతో డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్‌తో గెస్ట్ లెక్చర్స్ అందిస్తామన్నారు. కోచింగ్ సెంటర్లను ప్రతి జిల్లాకు విస్తరిస్తామని వెల్లడించారు. కోచింగ్ సెంటర్లను అకాడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది: మంత్రి అడ్లూరి
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం కోసం చేసిన అప్పులకు ఏటా రూ. 47 వేల కోట్లు కేవలం వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తున్నదని అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు పేరుతో బీఆర్ ఎస్ నేతలు కోట్లాది రూపాయల కమీషన్లు దండుకున్నా రని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను చూసి ప్రజలు హర్షిస్తుంటే.. అది చూసి ఓర్వలేక కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్ష కట్టారని విమర్శించా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న వారిని నడి బజారులో ఉరితీయాలని అద్దంకి దయాకర్ అన్నారు.
