- లేకపోతే బజేపీయే జోక్యం చేసుకుంటుందని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: పాతబస్తీలో మజ్లిస్ అండదండలతో డ్రగ్స్ రాకెట్ చెలరేగిపోతోందని, హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు బాలికల తల్లిదండ్రులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బెంగాల్ నుంచి వలస వచ్చిన హిందూ కుటుంబాల బాలికలే ఎక్కువగా ఈ ముఠాకు బలైపోతున్నారని చెప్పారు. డ్రగ్స్‌కు అలవాటు చేసి, కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారని.. పోలీసులు కేసులు నమోదు చేసినా, విచారణ జరపడంలేదన్నారు.
ఈ అరాచకాలు కేరళ ఫైల్స్ సినిమాను తలపిస్తున్నాయని, డ్రగ్స్ ముఠా హిందూ బాలికలు అత్యధికంగా చదువుకునే స్కూళ్లను టార్గెట్ చేస్తోందన్నారు. బాలికలకు డ్రగ్స్ ఉన్న చాక్లెట్లు అలవాటు చేసి, ఆ తర్వాత కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తున్నారని.. ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వివరించారు. పోలీసులు మజ్లిస్ నాయకుల ఒత్తిడితో కేసులను క్లోజ్ చేస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్ నాయకులు స్టేషన్‌కు వచ్చి డ్రగ్స్ ముఠా సభ్యులను విడిపించుకుని వెళుతున్నారని, మజ్లిస్ నేత ఒవైసీ చెప్పినట్లు నడుచుకునే పోలీసులకే పాతబస్తీలో పోస్టింగ్ ఇప్పించుకుంటున్నారని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హోంశాఖను చూస్తున్నందున, వెంటనే రంగంలోకి దిగి డ్రగ్స్ రాకెట్ ను ఏరివేయాలన్నారు. లేకపోతే బీజేపీ జోక్యం చేసుకుంటుందని, వేలాది మందితో హిందూ రక్షక దళాలు ఏర్పాటు చేసి, పాతబస్తీలో కవాతు చేస్తామన్నారు. అప్పుడు శాంతి భద్రతల సమస్య వస్తే సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యతని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీశ్ బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
