గ్రేటర్‌‌లో రూ.414 కోట్ల నష్టం.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

గ్రేటర్‌‌లో రూ.414 కోట్ల నష్టం.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు
  • చనిపోయిన వారి ఫ్యామిలీలకు రూ. 4 లక్షలు
  • వరదలకు గొలుసుకట్టు చెరువుల సిస్టమే కారణం

వరంగల్‌‌, వెలుగు : వారం పాటు పడిన భారీ వర్షాల కారణంగా వరంగల్‌‌, హనుమకొండ జిల్లాల పరిధిలో రూ. 414 కోట్ల నష్టం జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు చెప్పారు. రెండు జిల్లాల పరిధిలో జరిగిన వరద నష్టంపై శనివారం హనుమకొండ కలెక్టరేట్‌‌లో మంత్రి రివ్యూ నిర్వహించారు. శాసన మండలి వైస్‌‌ చైర్మన్‌‌ బండా ప్రకాశ్‍, ప్రభుత్వ చీఫ్‌‌ విప్‌‌ దాస్యం వినయ్‌‌ భాస్కర్‌‌, ఎంపీ పసునూరి దయాకర్‍, మేయర్‍ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‍, పెద్ది సుదర్శన్‌‌రెడ్డి, తాటికొండ రాజయ్య, కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్‍, సీపీ ఏవీ.రంగనాథ్‍, గ్రేటర్‌‌ కమిషనర్‌‌ రిజ్వానా బాషా, కుడా చైర్మన్‌‌ సుందర్‌‌ రాజ్‌‌యాదవ్‌‌ పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 

42 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లు, 38 కిలోమీటర్ల బీటీ, 95 కిలోమీటర్ల మెటల్‌‌ రోడ్లతో పాటు నాలాలు, డ్రైనేజీలు, కల్వర్టులు దెబ్బతిన్నట్లు తెలిపారు. 25 పునరావాస సెంటర్లను ఏర్పాటు చేసి 3,850 మందికి షెల్టర్‌‌ ఇచ్చామన్నారు. 92 టీంలను ఏర్పాటు చేసి 946 మందిని రక్షించినట్లు తెలిపారు. వరదల కారణంగా దెబ్బతిన్న చోట్ల తాత్కాలిక పనులు చేపట్టాలని ఆర్‌‌అండ్‌‌బీ, మున్సిపల్‌‌, విద్యుత్‌‌ శాఖ ఆఫీసర్లను ఆదేశించారు. గ్రేటర్‌‌ పరిధిలో మరోసారి వరద నష్టం జరగకుండా శాశ్వత పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. భద్రకాళి బండ్‍ కోసం రూ.150 కోట్లు, వడ్డేపల్లి చెరువుకు రూ.15 కోట్లు, నాలాల అభివృద్ధికి మరో రూ.75 కోట్లతో ప్రపోజల్స్‌‌ పంపాలని ఆదేశించారు. వరదలకు గొలుసు కట్టు చెరువుల సిస్టమే కారణమని అన్నారు. కల్లెడ చెరువు తెగకుండా చర్యలు తీసుకున్న పర్వతగిరి ఎస్సై వీరద్రరావును అభినందించారు. 

చనిపోయిన వారికి రూ.4 లక్షల పరిహారం

వరదల కారణంగా చనిపోయిన వారి ఫ్యామిలీలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.60 వేల నుంచి రూ.2 లక్షలు, పాక్షికంగా గాయపడ్డ వారికి రూ.12,700 ఇస్తామన్నారు. అలాగే ఇండ్లు దెబ్బతింటే రూ.95 వేలు, స్వల్పంగా అయితే రూ.3,200 నుంచి రూ.5 వేలు, గుడిసెలు దెబ్బతింటే రూ.4,100 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరదల వల్ల దుస్తులు, సామాన్లు పాడైనవారికి రూ.3,800 అందజేయనున్నట్లు చెప్పారు. 

గత ప్రభుత్వ హయాంలోనే నాలాలు,  చెరువు శిఖాలు కబ్జా

గత ప్రభుత్వాల హయంలోనే గ్రేటర్‌‌లో నాలాలు, చెరువు శిఖం భూములు కబ్జాకు గురయ్యాయని మంత్రి దయాకర్‌‌రావు చెప్పారు. గ్రేటర్‌‌లో వరద నివారణకు రూ.300 కోట్లతో పనులు చేపట్టగా ఇందులో రూ.250 కోట్ల పనులు పూర్తవగా, మరో రూ.50 కోట్ల పనులు చేయాల్సి ఉందన్నారు. నాలాల ఆక్రమణలు తొలగించే క్రమంలో కోర్టు కేసుల్లో ఉన్న నిర్మాణాలు, పేదల ఇండ్ల జోలికి పోకుండా ఆపామన్నారు. వరదల శాశ్వత పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.