
- ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి దామోదర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: డయాలసిస్ రోగులు చికిత్స కోసం పదుల కిలోమీటర్లు ప్రయాణించడం, గంటల తరబడి ఎదుXరుచూడటం వంటి ఇబ్బందులను తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి 20 – 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు. పట్టణాల్లో దూరాన్ని మాత్రమే కాకుండా, రోగుల సంఖ్య, జనాభాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
శనివారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్రంలో కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కిడ్నీ, క్యాన్సర్ వంటి జబ్బులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 102 డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వాటిలో 7,550 మంది ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని వివరించారు.
భారీగా పెరిగిన డయాలసిస్ రోగులు.
మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పల్లెల్లో కూడా బీపీ, షుగర్, కిడ్నీ, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలు విపరీతంగా పెరుగుతున్నాయని మంత్రి దామోదర ఆందోళన వ్యక్తం చేశారు. తెలిపారు. రాష్ట్రంలో 2009లో కేవలం 1,230 మంది డయాలసిస్ రోగులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 12,000 దాటిందని అధికారులు మంత్రికి వివరించారు.
జీవనశైలి వ్యాధులు రాకుండా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఆరోగ్యకరమైన జీవన విధానం, మంచి ఆహారపు అలవాట్లపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు వ్యాధుల నివారణ, నియంత్రణ, చికిత్సపై వైద్య వ్యవస్థ ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి సహకరిస్తం
ప్రభుత్వానికి తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ పేర్కొన్నది. తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి దామోదరను శనివారం ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. పేదలను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయబోమని నెట్ వర్క్ ఆసుపత్రులు హామీ ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్ సహా ఇతరులు ఉన్నారు.