దశలవారీగా ప్రభుత్వ ఆస్పత్రుల బ్రాండింగ్ : మంత్రి దామోదర

దశలవారీగా ప్రభుత్వ ఆస్పత్రుల బ్రాండింగ్ : మంత్రి దామోదర
  • ఓపీ, ఐపీ, సర్జరీల సంఖ్య పెంచడమే లక్ష్యం: మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులను దశలవారీగా బ్రాండింగ్ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యంపై నమ్మకం పెరిగేలా.. మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రులను బ్రాండింగ్ చేయాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రభుత్వ ఆస్పత్రుల  బ్రాండింగ్​పై ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ, ఐపీ, సర్జరీలను పెంచడంతోపాటు, సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తారని భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ బ్రాండింగ్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రజల అవసరాలకు ఆనుగుణంగా  బెడ్ ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, ఎక్విప్మెంట్లను సమకూర్చడం, బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. బ్రాండింగ్ లో భాగంగా ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా పేషెంట్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులలో పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేసి.. కార్పొరేట్ ఆస్పత్రుల కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల ను తీర్చిదిద్దాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు.