
హైదరాబాద్, వెలుగు: గత నాలుగేండ్లలో ఆరోగ్యశాఖకు వచ్చిన సీఎస్‌ఆర్ నిధులు, వాటితో చేపట్టిన పనుల వివరాలు ఇవ్వాలని హెల్త్ ఆఫీసర్లు, దవాఖాన్ల సూపరింటెండెంట్లను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మెడికల్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన కొనుగోళ్లు, డ్రగ్ సప్లయర్లకు చెల్లించాల్సిన బకాయిల వివరాలపైనా రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు.
కరోనా వ్యాప్తి, ప్రభుత్వ దవాఖాన్లలో పరిస్థితులపై శనివారం సెక్రటేరియెట్‌లో మంత్రి రివ్యూ నిర్వహించారు. దవాఖాన్లలో బెడ్లు, ఆక్సిజన్ సప్లై, మెడిసిన్, ఎక్విప్‌మెంట్ తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఉన్న అంకురా హాస్పిటల్ బిల్డింగులో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌పై మంత్రి ఆరా తీశారు. ఘటనపై ఎంక్వైరీ జరపాలని అధికారులను ఆదేశించారు.