
- జీతాలు వారి ఖాతాల్లో వేయాలి
- డైట్ మెనూ అమలుకు ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించండి
- కొత్త పాలసీల రూపకల్పనపై అధికారులతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: హాస్పిటల్ నిర్వహణలో కీలకమైన శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకురావాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కొత్త పాలసీల రూపకల్పనపై సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్.. ఆయా వ్యవస్థల్లోని లోపాలను మంత్రికి వివరించారు. ముఖ్యంగా సెక్యూరిటీ టెండర్లలో స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో వృద్ధులు, ఫిట్‌నెస్ లేనివారిని నియమిస్తున్నారని, దీనివల్ల భద్రత లోపిస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి ఆయా వ్యవస్థల ప్రక్షాళనకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
‘‘సెక్యూరిటీ గార్డులుగా 50 ఏళ్ల లోపు వయసుండి, పూర్తి ఫిజికల్ ఫిట్‌నెస్ ఉన్నవారినే నియమించాలి. మొత్తం సిబ్బందిలో కొంత శాతం రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది ఉండేలా నిబంధనలు మార్చాలి. ప్రతి ఆసుపత్రిలో తప్పనిసరిగా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిని సెక్యూరిటీ సూపర్‌వైజర్ గా నియమించాలి’’ అని మంత్రి సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో సీసీటీవీ మానిటరింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని, దాని పర్యవేక్షణ బాధ్యత కూడా సెక్యూరిటీ కాంట్రాక్టర్ దేనని స్పష్టం చేశారు.
పేషెంట్ కేర్‌కు పారామెడిక్స్
రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పేషెంట్ కేర్ వర్కర్ల నియామకంలో మార్పులు తీసుకురావాలని మంత్రి సూచించారు. ‘‘పేషెంట్ కేర్ వర్కర్లుగా ఏఎన్‌ఎం వంటి అర్హత కలిగిన పారామెడిక్స్ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచేసిన వారినే నియమించాలి. దీనివల్ల అర్హులకు ఉద్యోగాలు దక్కడంతో పాటు, రోగులకు నాణ్యమైన సేవలు అందుతాయి.
ఈ పోస్టుల్లో కనీసం 60 శాతం మహిళలు ఉండాలి’’ అని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచే పూర్తి బాధ్యత కాంట్రాక్టర్లదేనని, నిబంధనలు పాటించకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసేలా కొత్త పాలసీ ఉండాలని మంత్రి ఆదేశించారు.