- ప్రజారోగ్య పరిరక్షణలో రాజీలేకుండా పనిచేయాలి
- సీజనల్ వ్యాధులపై అధికారులతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: సీజనల్ కేసులను ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. ప్రతి కేసును జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ.. ప్రజారోగ్య పరిరక్షణలో ఎలాంటి రాజీలేకుండా పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలని తెలిపారు.
సోమవారం హైదరాబాద్ లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణ, ప్రభుత్వ ఆస్పత్రుల సంసిద్ధత, ప్రజారోగ్య పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే ముందు అవి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. మున్సిపల్, పంచాయతీరాజ్, విద్య, మహిళా, శిశు సంక్షేమం, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి భద్రత, క్షేత్రస్థాయి పర్యవేక్షణను వేగవంతం చేయాలన్నారు. ప్రతి జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లు పూర్తిస్థాయిలో పనిచేస్తూ ఎక్కడైనా వ్యాధుల క్లస్టర్లు ఏర్పడితే, వాటిని వెంటనే గుర్తించి వ్యాప్తిని అరికట్టాలని తెలిపారు.
ప్రతి జిల్లాకు సంబంధించిన వివరాలతో వీక్లీ రిపోర్టులు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌ను ఆదేశించారు. సమీక్షలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, జీహెచ్‌ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్‌సింగ్ నాయక్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్, మలేరియా విభాగం హెడ్ డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
