డాక్టర్ చీటీ లేకుండా మత్తు మందులు అమ్మొద్దు

డాక్టర్ చీటీ లేకుండా మత్తు మందులు అమ్మొద్దు
  • నకిలీ మెడిసిన్ల తయారీదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయండి
  • డ్రగ్ కంట్రోల్ అధికారులకు మంత్రి దామోదర ఆదేశం

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నకిలీ మందుల తయారీ, విక్రయాల్లో పాల్గొన్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. మెడిసిన్ అంటే ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశమని.. నిబంధనలు ఉల్లంఘించే ఫార్మా కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 బుధవారం వెంగళరావు నగర్‌‌లోని ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌‌లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలతో మెడిసిన్స్ అమ్మే కంపెనీలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడిసిన్‌‌ను ఆహార పదార్థాలుగా చూపించి తయారీ, విక్రయాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ పెద్ద ముప్పుగా మారుతోందని, నిబంధనలు ఉల్లంఘించి యాంటిబయాటిక్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించే సంస్థలను చట్టప్రకారం శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించారు. డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ అప్‌‌గ్రేడేషన్ పనులను వేగవంతం చేయాలని, త్వరలో మరిన్ని డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్ పోస్టులను మంజూరు చేసి రిక్రూట్ చేస్తామని తెలిపారు. 

700 కేసులు నమోదు చేశాం

2024–2025లో తమ పనితీరును డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం మంత్రికి వివరించారు. 2024లో 25,939 తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 4,142 సంస్థలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2025 జనవరి నుంచి జూలై వరకు 16,481 తనిఖీలు చేసి, 2,827 సంస్థలపై చర్యలు తీసుకున్నామన్నారు. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు 7,200 మెడిసిన్ సాంపిల్స్‌‌ను పరీక్షించగా, 186 నాసిరకం మందులుగా తేలాయని, సంబంధిత సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ కాలంలో సుమారు 700 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.