- ‘తెలంగాణ- నార్త్ ఈస్ట్ కనెక్ట్’ సదస్సులో మంత్రి దామోదర రాజనర్సింహ
- హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం క్యాపిటల్‌గా మారుస్తం
- సర్కారు హాస్పిటల్స్‌లో ఫ్రీగా ఐవీఎఫ్.. డయాలసిస్ సెంటర్లు పెంచుతామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రాలు వేరైనా.. సంస్కృతులు భిన్నమైనా.. భారతీయులుగా మనమంతా ఒక్కటే.. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆరోగ్య అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది’’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భరోసా ఇచ్చారు. అనారోగ్యం వస్తే తక్షణమే మెరుగైన, ఉచిత వైద్యం అందాలన్నదే పేదోడి కోరిక అని, ఆ బాధ్యతను రాష్ట్ర సర్కారు సీరియస్ గా తీసుకుందని చెప్పారు.
బుధవారం రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన ‘తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్’ ఆరోగ్య సదస్సులో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని, ప్రసంగించారు. బస్తీ దవాఖానల నుంచి మొదలుకొని గాంధీ, ఉస్మానియాలాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు పటిష్టమైన నెట్‌వర్క్‌తో ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలతో తెలంగాణ బంధాన్ని బలపరుస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.
ఉచిత వైద్యమే లక్ష్యం
రాష్ట్రంలో వైద్య రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నామని, భవిష్యత్తులో హైదరాబాద్‌ను ‘మెడికల్ టూరిజం క్యాపిటల్’ గా మారుస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే.. ఇప్పుడు 102 సెంటర్ల ద్వారా 12 వేల మందికి సేవలందిస్తున్నామని, త్వరలో మరో 79 సెంటర్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 1800 రకాల చికిత్సలు ఉచితంగా అందిస్తున్నామని, దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు కూడా షురూ చేశామని గుర్తుచేశారు.
కొత్త ఉస్మానియా భవనం, టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీలతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు చేరువ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భాగస్వాములు కావాలని, ఆరోగ్యపరంగా వారికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు తాము సిద్ధమని మంత్రి భరోసా ఇచ్చారు.
