జంక్ ఫుడ్ వల్ల చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ

జంక్ ఫుడ్ వల్ల చిన్న వయసులోనే  ఆరోగ్య సమస్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్ వేదికగా ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. హెల్త్ వీక్ వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు నగరవ్యాప్తంగా ఆరోగ్య చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే సందర్భంగా జలవిహార్ నుండి ఐమ్యాక్స్ HMDA గ్రౌండ్స్ వరకు ఈట్ రైట్ - స్టే హెల్తీ పేరుతో భారీ వాకథాన్‌ను నిర్వహించారు. ఈ వాక్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహార అలవాట్లే పునాది అని ఆయన గుర్తు చేశారు.  మనం తినే ఆహారంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. నేటి కాలంలో జంక్ ఫుడ్ వల్ల చిన్న వయసులోనే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం అర గంట ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం కేటాయిస్తే అది మన జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి.అంతేకాకుండా, ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం మరిన్ని మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహార కల్తీని అరికట్టడంలో ప్రభుత్వం ఎంత కఠినంగా ఉన్నా, ప్రజల సహకారం ఉంటేనే ఇది సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.