ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండండి : మంత్రి దామోదర రాజనర్సింహ

ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండండి : మంత్రి దామోదర రాజనర్సింహ
  • అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రభావిత జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి దామోదర హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు.

 మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటలతో పాటు ఇతర జిల్లాల్లోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అంబులెన్స్ లను  అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, ఫార్మాసిస్ట్, ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.