మ‌రో మూడు రోజుల వ‌ర‌కూ తుఫాన్.. అప్ర‌మ‌త్తంగా ఉండండి

మ‌రో మూడు రోజుల వ‌ర‌కూ తుఫాన్.. అప్ర‌మ‌త్తంగా ఉండండి

జయశంకర్ భూపాల‌ప‌ల్లి: జిల్లాలోని టేకుమట్ల మండలం కుందన్ పల్లి గ్రామం లో చలి వాగులో చిక్కుకున్న పది మంది రైతులను రెండు హెలికాప్టర్లలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం ప‌ట్ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రైతుల కుటుంబాల ద్వారా వాగులో చిక్కుకున్న వారి స‌మాచారం అంద‌డం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొర‌వ చూప‌డం, ఎమ్మెల్యే గండ్ర‌, క‌లెక్ట‌ర్, ఎస్పీలు స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించ‌డంతో ఆ ప‌ది మందిని ర‌క్షించ‌గ‌లిగామ‌ని అన్నారు.

ప‌ది మంది రైతుల‌ను ర‌క్షించిన రెస్క్యూ టీమ్ ను అభినందించారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న ఆ ప‌ది మందిని ర‌క్షించ‌డానికి స‌హ‌క‌రించిన సీఎం కెసిఆర్ , మంత్రి కెటిఆర్ కు మంత్రి  కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తుఫాన్ మ‌రో రెండు మూడు రోజులు కొన‌సాగ‌నున్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌వ‌డం మంచిదని మంత్రి సూచించారు. పాత ఇళ్ళ‌ల్లో ఉన్న వాళ్ళు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలని చెప్పారు. రైతులు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ మూడు నాలుగు రోజుల పాటు పొలం, చెల‌క ప‌నుల‌ను వాయిదా వేసుకోవాల‌ని కోరారు. వాగులు, వంక‌లు దాటి వ్య‌వ‌సాయ ప‌నుల సాహ‌సాలు చేయొద్ద‌ని మ‌న‌వి చేశారు.

లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్టుగా మంత్రి తెలిపారు. అవ‌స‌ర‌మైతే, పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని సూచించిన‌ట్టు వెల్ల‌డించారు. అధికారులు తుఫాన్ త‌గ్గే వ‌ర‌కు ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూ ఉండాలన్నారు. అవ‌స‌ర‌మైన అన్ని స‌మ‌యాల్లోనూ తాను అధికారులు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉంటానని ఎ‌ర్ర‌బెల్లి తెలిపారు.‌