- విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు న్యాయస్థానం నిరాకరణ
హైదరాబాద్, వెలుగు: విద్యుత్తు బకాయిలకు సంబంధించిన వివాదంలో గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(గీతం) యూనివర్సిటీకి సోమవారం హైకోర్టులో చుక్కెదురైంది. ఈ నెల 20న తొలగించిన విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
దీనిపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామంటూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. రూ.118 కోట్ల విద్యుత్తు బకాయిలకు సంబంధించి టీజీఎస్‌పీడీసీఎల్ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ గీతం యూనివర్సిటీ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఇది విచారణలో ఉండగా శనివారం విద్యుత్తు సరఫరాను తొలగించడంతో గీతం యూనివర్సిటీ సోమవారం అత్యవసరంగా మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టగా గీతం యూనివర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైకోర్టులో విచారణ సందర్భంగా ఈఈని హాజరుకావాలన్న ఆదేశాలతోనే విద్యుత్తు సరఫరాను తొలగించరన్నారు. 8 వేల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీబీసీ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధంలేదని, ఆ బకాయిలను కంపెనీయే చెల్లించుకోవాలన్నారు.
వాటితో యూనివర్సిటీకి సంబంధంలేదన్నారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు ఆదేశాలివ్వాలని కోరగా జడ్జి జోక్యం చేసుకుంటూ 50% బకాయిలు చెల్లిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అలాకాకపోతే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామన్నారు. టీజీఎస్‌పీడీసీఎల్ తరఫు న్యాయవాది ఎన్.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 15 రోజుల్లో బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చామని, నోటీసును సవాలు చేస్తూ గీతం పిటిషన్ దాఖలు చేసిందన్నారు.
ఇందులో ఎలాంటి స్టే లేదని, అందువల్ల సరఫరాను రద్దు చేశామన్నారు. 2020లో కూడా వారే పిటిషన్ దాఖలు చేసి ఉపసంహరించుకున్నారన్నారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు లేనందున ఫైలు అందుబాటులో లేదని, వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరారు. దీనిపై వాదనలు వినిపించడానికి బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు.
