బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బహిరంగ సవాల్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బహిరంగ సవాల్

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు ఇస్తున్నారా?: మంత్రి ఎర్రబెల్లి 

బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ విమర్శించారు. హన్మకొండలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చిన నిధులను సాక్షాలతో నేతలు చూపాలన్నారు. దుబ్బాకలో తప్పుడు ప్రచారాలు చేసి ఓ కార్యకర్తను బలిచేసి ప్రజలను మోసం చేసి గెలిచార‌న్నారు.

బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి అన్నారు. వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం అయినా పట్టించు కోలేదని, పేదల సంక్షేమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీల పాత్ర ఏమీటో చెప్పాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథకు కేంద్రం 10 అవార్డులు ఇచ్చి ప్రశంసింది.. కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదని మంత్రి విమ‌ర్శించారు. హైదరాబాద్ నగరం వరదలకు కొట్టుకుపోతే ఆదుకోవాలనే సోయి లేదని అన్నారు. బీజేపీ నేతలు ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారన్నారు.

బీజేపీ – కాంగ్రెస్ పార్టీలకు బహిరంగ సవాల్.. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు ఇస్తున్నారా? ఇస్తే రుజువు చేయాల‌ని ఎర్ర‌బెల్లి అన్నారు. తెలంగాణ రైతులకు అవగాహన కల్పిస్తామ‌ని, త్వరలోనే రైతులు బీజేపీ నేతలను తరిమికొడతార‌న్నారు. బీజేపీ నేతలవన్నీ బోగస్ మాటలని… కార్పోరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారి రైల్వేను ప్రయివేటీకరణ చేసిన చరిత్ర బీజేపీది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు తెలంగాణ ప్రజలు- రైతులు సిద్ధం కావాల‌న్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. దుబ్బాక గెలుపు వాపును చూసి బీజేపీ నేతలు బలుపుగా భావిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ లు రైతుల‌ను మోసం చేస్తున్నాయని, ఆ పార్టీలను నమ్మొద్ద‌ని అన్నారు.