కాంగ్రెస్​ను నమ్మితే నట్టేట మునిగినట్టే: ఎర్రబెల్లి

కాంగ్రెస్​ను నమ్మితే  నట్టేట మునిగినట్టే: ఎర్రబెల్లి

తొర్రూరు/పాలకుర్తి, వెలుగు: కాంగ్రెస్​ను నమ్మితే నట్టేట మునిగినట్లే అని.. ఆ పార్టీ అధికారంలోకి రాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్​ను మరోసారి గెలిపించి, కేసీఆర్​ను సీఎం చేయాలని ప్రజలను కోరారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సుమారు రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని 30 పడకల హాస్పిటల్​ను 50 పడకల ఆసుపత్రిగా అప్​గ్రేడ్ చేసే పనులకు, కొడకండ్ల మండల కేంద్రంలో మినీ టెక్స్​టైల్ పార్క్​పనులకు దయాకర్​రావు సోమవారం శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తొర్రూరును రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. గతంలో తొర్రూరులో సీసీ రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, సిగ్నల్ వ్యవస్థ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, యతిరాజారావు పార్కు అభివృద్ధి, మోడల్ మార్కెట్​ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. 

తాజాగా రూ.22 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు, రూ.3.50 కోట్ల టీయూఎఫ్​ఐడీసీ నిధులతో కొత్త మున్సిపల్ ఆఫీసు బిల్డింగు, రూ.14 కోట్ల టీయూఎఫ్​ఐడీసీ నిధులతో తొర్రూరు పెద్ద చెరువు మినీట్యాంక్​బండ్​, కాల్వల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 

కాంగ్రెస్ దుష్ట పరిపాలన వల్లే తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. కేసీఆర్ అందిస్తున్న దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా, పెన్షన్లు, కేసీఆర్ కిట్లు లాంటి స్కీములు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలుకావడం లేదన్నారు. అక్కడ ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణలో అమలుగాని హామీలు ఇస్తున్నదని విమర్శించారు. 

తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఓటువేసి గెలిపించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జనగామ కలెక్టర్​ శివలింగయ్య, తొర్రూరు మున్సిపల్​ చైర్మన్​ రామచంద్రయ్య,  తదితరులు పాల్గొన్నారు.