దేశంలోనే అతిపెద్ద టెక్స్ట్ టైల్ పార్క్ ఇది: ఎర్రబెల్లి

దేశంలోనే అతిపెద్ద టెక్స్ట్ టైల్ పార్క్ ఇది: ఎర్రబెల్లి

వరంగల్ లో నిర్మించబోయే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ ప్రాంతంలో నిర్మించబోయే టెక్స్ట్ టైల్ పార్క్ తో 7 వేల కోట్ల ఉత్పత్తులు జరుగుతాయని, దేశంలోనే అతిపెద్ద టెక్స్ట్ టైల్ పార్క్ ఇదని అన్నారు. టెక్స్ట్ టైల్ పార్క్ రావడం ప్రాంత అదృష్టమని ఎర్రబెల్లి అన్నారు.

పార్కు నిర్మించేందుకు భూ సేకరణ త్వరగా పూర్తి చెయ్యాలని అధికారులకు తెలిపారు. మూడు నెలల్లో పార్క్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.  పార్కులో దాదాపు రూ.100 కోట్లతో పనులు సాగుతున్నాయని, పనులన్నీ పూర్తిచేసి, పరిశ్రమలు స్థాపన జరిగితే నేరుగా లక్ష మందికి, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లు వస్త్ర పరిశ్రమ పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ద పెట్టారని  ఎర్రబెల్లి అన్నారు.

పార్క్ అవసరాల కోసం ప్రత్యేక పైప్ లైన్ నిర్మిస్తామన్నారు ఎర్రబెల్లి. ప్రస్తుతం విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయిందని, ప్రహరీ నిర్మాణం, రోడ్లు, బ్రిడ్జ్ నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. మొత్తం రూ.1100 కోట్లతో మౌళిక సదుపాయలు, అభివృద్ది పనులు చేపట్టామని దయాకర్ రావు ఈ సందర్భంగా తెలిపారు.