రేవంత్.. చీటర్​ టిక్కెట్లు అమ్ముకుంటున్నడు: ఎర్రబెల్లి

రేవంత్.. చీటర్​ టిక్కెట్లు అమ్ముకుంటున్నడు: ఎర్రబెల్లి
  •    జనమంతా బీఆర్​ఎస్​ వెంటే ఉన్నరు
  •     ఏడాదికో పార్టీ మారే రేవంత్.. కేటీఆర్​ను విమర్శిస్తడా?
  •     16న జనగామ సభను సక్సెస్​ చేయాలని మంత్రి పిలుపు  

జనగామ, వెలుగు: రేవంత్​రెడ్డి.. ఓ బ్రోకర్, చీటర్, బ్లాక్​మెయిలర్ అని, పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఫైరయ్యారు. శనివారం జనగామలోని బీఆర్​ఎస్ ఆఫీస్​లో పల్లా రాజేశ్వర్​రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్​నాయకత్వంలో కాంగ్రెస్​పార్టీ అట్టర్​ఫ్లాప్ కావడం ఖాయమన్నారు. ఏడాదికో పార్టీ మారే రేవంత్.. కేటీఆర్​ను విమర్శించడం సిగ్గుచేటన్నారు.

రేవంత్​రెడ్డి మొదట్లో గోడల మీద రాతలు రాసే పెయింటర్​ అని, ఆ తర్వాత ప్రింటింగ్​ ప్రెస్​నడిపాడని, ఆయన బతుకు అందరికీ తెలుసన్నారు. కొడంగల్​లో చిత్తుచిత్తుగా ఓడిస్తే రంగారెడ్డి జిల్లాపై పడ్డాడని, దమ్ముంటే ఇప్పుడు గెలవాలని సవాల్​ విసిరారు. తెలంగాణ జనం కేసీఆర్​ను గుండెల్లో పెట్టుకున్నారని, 15న ప్రకటించే​మేనిఫెస్టోతో ఆయనకు మరింత మద్దతు పెరుగుతుందన్నారు.

రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్​ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు. 16న జనగామలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్​ఎస్​లోకి వస్తానంటే స్వాగతిస్తామన్నారు. 40 ఏండ్లు కాంగ్రెస్​ పార్టీకి సేవ చేసిన బీసీ నేత పార్టీ మారితే.. రేవంత్​స్పందించిన తీరు దారుణంగా ఉందన్నారు.  

కేసీఆర్​ సభ ఏర్పాట్లు ముమ్మరం:  పల్లా 

జనగామ– సిద్దిపేట రోడ్డులోని మెడికల్​కాలేజీ గ్రౌండ్స్​లో 16న నిర్వహించనున్న కేసీఆర్​ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్టు పల్లా రాజేశ్వర్​ రెడ్డి చెప్పారు. మధ్యాహ్నం  2 గంటలకు సభా ప్రాంగణానికి సీఎం చేరుకుంటారని, ఘనస్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం మంత్రి దయాకర్​ రావుతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​ రెడ్డి, మున్సిపల్​ చైర్​పర్సన్​ పోకల జమున లింగయ్య తదితరులు వారి వెంట ఉన్నారు.