రివ్యూల మీద రివ్యూలు పెట్టి సీఎం కోవిడ్ బారిన పడ్డారు

రివ్యూల మీద రివ్యూలు పెట్టి సీఎం కోవిడ్ బారిన పడ్డారు
  • ఎంజీఎంలో బెడ్లకు, ఆక్సిజన్‌కు కొరత లేదు
  • డాక్టర్లు కరోనా బారినపడ్డా సేవలందిస్తూనే ఉన్నారు
  • ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు
  • వరంగల్ ఎంజీఎంను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి


సీఎం కరోనా పరిస్థితిపై రివ్యూల మీద రివ్యూలు పెట్టి కోవిడ్ బారిన పడ్డారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 
కరోనా సోకిందని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేరి డబ్బులు వృధా చేసుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. వరంగల్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో బుధవారం ఆయన స్థానిక ఎంజీఎం ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. 

‘వరంగల్‌‌కు ఇతర జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారు. అందుకే కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. ఎంజీఎంలో 800 బెడ్లు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఆక్సిజన్ కొరత కూడా లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ జనరేషన్  ప్లాంట్ త్వరలోనే ఏర్పాటు చేస్తాం. పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. జనరల్ వార్డును కేంసీఈకి షిఫ్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎంజీఎంలో 650 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. వాటిలో 440 మంది కోవిడ్ పేషేంట్స్ చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు, స్టాఫ్ ఇబ్బంది పడుతూనే సేవ చేస్తున్నారు. కొందరు డాక్టర్లు కోవిడ్ బారిన పడుతున్నా నిరంతరం సేవలు అందిస్తూనే ఉన్నారు. రెమ్డిసివిర్‌ ఇంజక్షన్లు ఎంజీఎంలో లేవన్న మాట వాస్తవమే. సాయంత్రం వరకు అందుబాటులోకి  వస్తాయని మంత్రి ఈటల చెప్పారు. కేంద్రం మనకేదీ పంపిస్తలేదు. నిన్న సీఎం కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు.

అశోక్ అనే పేషేంట్ దగ్గర ప్రైవేట్ ఆస్పత్రులు డబ్బులు వసూలు చేసి పీడిస్తే ఎంజీఎంకు వచ్చాడు. ఇక్కడి డాక్టర్లు బాగా సేవ చేస్తున్నారని చెప్పిండు. కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటన్నింటిని త్వరలోనే తీరుస్తాం. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి  ఇబ్బంది ఉన్నా ఎంజీఎంకు రావాలి. 
రివ్యూల మీద రివ్యూలు పెట్టి సీఎం కోవిడ్ బారిన పడ్డారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేరి డబ్బులు వృధా చేసుకోవద్దు. ఎంజీఎంలో అన్ని వసతులు ఉన్నాయి. స్మశానవాటిక విషయమై కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారం చేస్తాం’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.