- ఏళ్లుగా మూలుగుతున్న ప్రాజెక్ట్‌లపై మంత్రి ఉత్తమ్ ఫోకస్
- కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలతో పాటు పాత పనుల పునరుద్ధరణకు ప్లాన్
- ఎస్‌ఎల్‌బీసీ, డిండి, గంధమల్ల, బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టులకు నిధులు
- లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు ఏడాదే డెడ్‌లైన్
- నియోజకవర్గాల వారీగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రివ్యూ
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్ట్‌లపైన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోకస్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను వచ్చే మూడేళ్లలో కంప్లీట్ చేయాలన్న లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. కృష్ణా, గోదావరి నదుల కింద గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్ట్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సొంత నియోజకవర్గాలైన కోదాడ, హుజూర్‌నగర్ నుంచి మొదలు పెట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ రివ్యూలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు, ఏఎమ్మార్పీ పరిధిలోని ఎస్‌ఎల్‌బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలపైన ఆదివారం రివ్యూ చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని ఎడమ కాల్వ లైనింగ్ పనులు, డిస్ట్రిబ్యూటరీలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఎడమకాల్వ పరిధిలో చివరి భూములకు సైతం నీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలపైన ఫోకస్ పెట్టారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వల లైనింగ్ పనులు కూడా ఈ ఏడాది ప్రారంభించనున్నారు.
సాగర్ ఆయకట్టు పరిధిలో కొత్త లిఫ్ట్‌లు
ఆదివారం మిర్యాలగూడలో రివ్యూ చేసిన మంత్రి ఉత్తమ్ ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు రూ.595 కోట్లు కేటాయించారు. అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద చేపట్టిన దున్నపోతుల గండి స్కీంకు రూ.219.19 కోట్లు, దామరచర్ల మండలం బొత్తలపాలెం లిఫ్ట్‌కు రూ. 259.25 కోట్లు, వీర్లపాలెం---2 స్కీంకు రూ.32.22 కోట్లు, తోపుచర్ల లిఫ్ట్ స్కీంకు రూ.9.30 కోట్లు, కేశవాపురం స్కీంకు రూ.75.93 కోట్లు శాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. దేవరకొండలో ఇప్పటికే శాంక్షన్ చేసిన అంబా భవాని, కంబాలపల్లి లిఫ్ట్స్కీంలను కూడా త్వరగా కంప్లీట్చేస్తామని హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నెల్లికల్లుతో సహా ఇతర పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో పాత లిఫ్ట్‌ల పునరుద్ధరణకు భారీగా నిధులు కేటాయించిన మంత్రి, కోదాడ మండలం రెడ్లకుంటలో కొత్త లిఫ్ట్ రూ.47. 54 కోట్లు, పాలకీడు మండలం బెట్టతండాలో రూ.33.83 కోట్లతో లిఫ్ట్‌కు ఇటీవలే శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు మొత్తం లిఫ్ట్స్కీంలు కంప్లీట్ చేయాలని ఆఫీసర్లకు డెడ్‌లైన్ పెట్టారు. ఇవన్నీ పూర్తయితే సుమారు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, డిండి లిఫ్ట్ స్కీంకు నిధులు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లు పట్టించుకోకుండా వదిలేసిన శ్రీశైల సొరంగ మార్గం పనులు వచ్చే మూడేళ్లలో పూర్తిచేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయించగా, రివైజ్డ్ ఎస్టిమేట్లు తయారు చేసి కేబినెట్ ముందు పెడతామని ఆదివారం దేవరకొండలో జరిగిన మీటింగ్‌లో చెప్పారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించగా, దీని కింద సుమారు మూడున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. బేరింగ్ సమస్య వల్ల ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆగిపోయాయి. ఈ నెలాఖరున అమెరికా నుంచి బేరింగ్ రానుంది. దీన్ని బిగించడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో నవంబర్ నుంచి పనులు మొదలుకానున్నాయి. నకిరేకల్ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి సొంత గ్రామం బ్రహ్మణవెల్లంలలో చేపడుతున్న బి.వెల్లంల రిజర్వాయర్ పరిధిలో భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీలు, మెయిన్ కెనాల్‌లో ఆగిపోయిన పనులు ఈ ఆర్థిక సంవత్సరంలోగా కంప్లీట్ చేయనున్నారు.
గోదావరి, మూసీ కింద ప్రాజెక్ట్‌లకు మోక్షం
గోదావరి, మూసీ నదుల కింద పనులు పూర్తిచేయకుండా గత ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది. ప్రధానంగా యాదాద్రి జిల్లాలో గంధమల్ల రిజర్వాయర్ పనులు అడుగు కూడా ముందుకు కదల్లేదు. గంధమల్ల రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు తీసుకొచ్చి అక్కడి నుంచి చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ వరకు తాగునీరు సప్లై చేస్తామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత పట్టించుకోలేదు. 9 టీఎంసీలు, 4 టీఎంసీలు అని చెప్పి అసలు గంధమల్ల ఊరే లేకుండా చేయాలని చూశారు. కానీ గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4 టీఎంసీల నుంచి 1.4 టీఎంసీలకు తగ్గిస్తామని, తద్వారా ఎలాంటి ముంపు ఉండదని మంత్రి ప్రకటించారు. రూ.522 కోట్ల అంచనాతో నిర్మించే ఈ రిజర్వాయర్ వల్ల 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. మూసీ నది కింద ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనులు కూడా చేపట్టనున్నారు. శ్రీరాంసాగర్ ఫేజ్ 2 కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆర్‌అండ్‌ఆర్ వర్క్స్‌కు రూ.34 కోట్లు, మూసీ ప్రాజెక్ట్, దాని అనుబంధ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఇతర వర్క్స్‌కు రూ. 64 కోట్లు కేటాయించారు.
ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్ చేయాలి
కిష్టరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇబ్రహీంపట్నం వద్ద ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో కిష్టరాంపల్లి, చర్లగూడెం ప్రాజెక్టులు చాలా పెద్దవని, ఈ ప్రాజెక్ట్‌ల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2018లో రూ. 4 నుంచి రూ. 5 లక్షల పరిహారం మాత్రమే అందిందని, కనీసం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో అయినా న్యాయం చేయాలని కోరారు. ఉదయసముద్రం ప్రాజెక్ట్ కింద మునుగోడు నియోజకవర్గంలో ఆయకట్టును మరో 20 వేల ఎకరాలు పెంచాలని మంత్రిని కోరారు.
ఎడారిగా మార్చిన జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
‘నల్గొండ జిల్లాను గత ప్రభుత్వం ఎడారిగా మార్చింది. వచ్చే మూడేళ్లలో పెండింగ్ ప్రాజెక్ట్‌లను కంప్లీట్ చేసి, జిల్లాను సస్యశ్యామలం చేసి తీరుతాం. సాగర్ ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న మేజర్ కాల్వల పూడికతీత, రిపేర్లు, చెక్‌డ్యాంల నిర్మాణాలకు అవసరమైన నిధులు కేటాయిస్తాం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు నూటికి నూరు శాతం పూర్తి చేస్తాం’ అని డిండిలో జరిగిన రివ్యూలో మంత్రి హామీ ఇచ్చారు. టన్నెల్‌లో రెండు వైపుల నుంచి సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. సొరంగ మార్గం పూర్తి చేయడానికి రూ.460 కోట్లతో రివైజ్జ్ ఎస్టిమేషన్స్ వేస్తామని, డిండి ద్వారా మరో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఏడాదికి ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరిస్తామని మంత్రి తెలిపారు.
