
- రాహుల్‌కు క్రెడిట్ వస్తదని బీజేపీకి భయం పట్టుకున్నది: మంత్రి వివేక్ వెంకటస్వామి
- బీసీల నోటికాడి ముద్దను లాక్కోవద్దు బీసీ కోటాకు కట్టుబడి ఉన్నాం
- 23న కేబినెట్‌లో ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
- బీసీ బంద్‌కు మద్దతుగా మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్న మంత్రి
కోల్‌బెల్ట్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటున్నదని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి క్రెడిట్ ఎక్కడ దక్కుతుందోనన్న భయంతోనే బీసీ కోటాను బీజేపీ అడ్డుకుంటున్నదని ఫైర్ అయ్యారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కోవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, చెన్నూరు, రామకృష్ణాపూర్, మంచిర్యాల పట్టణాల్లో మంత్రి వివేక్ పర్యటించారు. బీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌కు మద్దతుగా చెన్నూరు, మందమర్రి పట్టణాల్లో బీసీ సంఘాలు చేపట్టిన ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని చెప్పారు. అసెంబ్లీలో బీసీ బిల్లును పాస్‌చేసి పంపినా కేంద్రం ఆమోదించడం లేదని మండిపడ్డారు. బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా కేంద్రం అనుమతి ఇవ్వడం లేదన్నారు. బీజేపీ నైజమేంటో రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం మొత్తానికి తెలిసిందని, వాళ్లిప్పుడు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు.
బీసీ కోటాను తగ్గించిందే బీఆర్ఎస్..
బీఆర్ఎస్ హయాంలోనే బీసీ కోటాను తగ్గించారని మంత్రి వివేక్ మండిపడ్డారు. ‘‘మేం అధికారంలోకి వచ్చాక శాస్త్రీయంగా సర్వే చేసి బీసీ జనాభా లెక్కలు తీశాం. ఆ లెక్కల ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాం. బీసీల్లో ఎక్కువ శాతం వెనుకబడి ఉన్నారు. విద్య, ఉద్యోగాలు, ఎన్నికల పరంగా రిజర్వేషన్లలో నష్టపోతున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి బీసీల పక్షాన నిలబడ్డారు. బీసీల న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది. ఈ నెల23న జరిగే కేబినెట్‌సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. బీసీ బంద్‌కు కాంగ్రెస్ పక్షాన మద్దతు ఇచ్చామని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పారు. ర్యాలీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మందమర్రి పట్టణ, మండల అధ్యక్షులు సకినాల శంకర్, కుదిరే అంజయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిళ్ల శ్రీనివాస్, పట్టణ గౌరవ అధ్యక్షుడు పోలు శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షుడు ముడారపు శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుల ఖాతాల్లో లక్ష బోనస్..
సింగరేణి కార్మికులకు ప్రకటించిన రూ.400 కోట్ల దీపావళి బోనస్‌ను వాళ్ల ఖాతాల్లో జమ చేశారని, ఒక్కో కార్మికుడి ఖాతాలో లక్షా 3 వేల రూపాయలు జమయ్యాయని మంత్రి వివేక్ తెలిపారు. దసరా పండుగ ముందు సంస్థ లాభాల్లో ఒక్కో కార్మికుడికి సుమారు రూ.2 లక్షల చొప్పున పంపిణీ చేశామని గుర్తుచేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో వివేక్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, సింగరేణి కార్మికులకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు కాకా వెంకటస్వామి చేసిన కృషితో సింగరేణి సంస్థ లాభాల బాటలో కొనసాగుతూ తెలంగాణకు మణిహారంగా మారిందని చెప్పారు. కొత్త బొగ్గు గనులపైనే సంస్థ మనుగడ ఆధారపడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని బొగ్గు గనులు తీసుకురావాలన్నారు. కొత్త బొగ్గు గనులతో ఉద్యోగాలు లభించడంతో పాటు సింగరేణి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు: వివేక్
పెద్దపల్లి, వెలుగు: జుబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. గతంలో కంటే పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తొగరి తిరుపతి, గొట్టపర్తి నరేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.