
- విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, సాగు నీటి రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినం: వివేక్ వెంకటస్వామి
- వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన మెదక్ జిల్లాను ఆదుకుంటాం
- తక్షణ సాయం కింద ఇప్పటికే రూ.10 కోట్లు మంజూరు
- ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జాతీయ పతాకం ఆవిష్కరణ
మెదక్/నర్సాపూర్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెతుకు (మెదక్) సీమలో విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించామని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య, మహిళా, శిశు సంక్షేమం, సాగు నీటి రంగం, మున్సిపాలిటీల్లో ఎంతో ప్రగతి సాధించిందని చెప్పారు.
ఆరు గ్యారం టీల్లో భాగంగా మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు మహిళలు 3.55 కోట్ల సార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని, దీని వల్ల రూ.87.81 కోట్ల మేర లబ్ధి పొందారన్నారు. దీంతో పాటు గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్లు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహిళా సంఘాలకు రుణాలు తదితర స్కీం కింద జిల్లాలో ప్రజలు, మహిళలకు కోట్ల మేర లబ్ధి జరిగిందన్నారు.
మెదక్ లో కొత్త మెడికల్ కాలేజీ బిల్డింగ్ కోసం రూ.180 కోట్లు, నర్సింగ్ కాలేజ్ కోసం రూ.26 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. రూ.200 కోట్లతో రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, అడిషనల్ కలెక్టర్ నగేష్, అడిషనల్ ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు.
వరద నష్టం అంచనాలు సిద్ధం..
జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించి వివిధ శాఖలు అంచనాలు రూపొందించాయని, ఇప్పటికే టెంపరరీ మరమ్మతు పనులు ప్రారంభించామని, శాశ్వత పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం మెదక్ కలెక్టరేట్‌లో ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో వరద నష్టం అంచనాలపై సమీక్షించారు. వరదలతో జిల్లాకు భారీ నష్టం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ వివరించారు. హవేలి ఘనపూర్ మండలంలో వరదల్లో చనిపోయిన ఇద్దరి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపారు. వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి జిల్లాకు ఆర్థిక సహాయం అందేలా చేస్తామని చెప్పారు. తక్షణ సహాయం కింద రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక..
ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్న వారికి ఉచి తంగా ఇసుక అందిస్తామని, కేవలం ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు భరిస్తేచాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో టీజీఎండీసీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన ఇసుక బజార్‌తో పాటు టౌన్లో వైకుంఠధా మాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. ఇసుక నల్గొండ నుంచి వస్తుందని, టన్నుకు రవాణా చార్జి కింద రూ.1,200 చెల్లించాలన్నారు. ఇసుక అనంతరం నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం దగ్గర నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజ నేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి, ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చేసి చూపితేనే ప్రజలు నమ్ముతరు
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం రహమత్‌నగర్ డివిజన్‌లోని టి.అంజయ్యనగర్, శ్రీరాంనగర్, రహమత్‌నగర్ ప్రాంతంలో రూ.4.63 కోట్లతో తాగు నీటి పైపులైన్లు, సీవరేజ్ వంటి పనులకు బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. గతంలో శంకుస్థాపన చేసిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. అయితే, తాను పనులు జరుగుతాయని స్పష్టత ఉంటేనే శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు.
ప్రజలకు అభివృద్ధి చేసి చూపితేనే మనపై వారికి నమ్మకం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొందరు స్థానికులు తమ ప్రాంతంలో కూడా తాగునీటి పైపులైన్ సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకురాగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ప్రభుత్వం నిధులివ్వకపోతే సొంత నిధులతో పైపులైన్ మార్పిడి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ సీసీఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకు లు నవీన్ యాదవ్, భవాని శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు మల్రెడ్డి రాంరెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.