కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ ఆందోళన

కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ ఆందోళన

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో బుధవారం ఢిల్లీ మంత్రి, ఆప్ లీడర్ గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. " మేము సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాం. ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. మార్చి 21 న ED ఆయనను అరెస్టు చేసింది.. ఆ తర్వాత నుంచి ఆయన బరువు తగ్గుతున్నారు.  జైలు అడ్మినిస్ట్రేషన్, డాక్టర్లు కేజ్రీవాల్ ను బాగా చూసుకుంటారని భావిస్తున్నాం"  అని చెప్పారు.  అరెస్టు అయినప్పటి నుంచి ఇప్పటివరకు కేజ్రీవాల్ దాదాపు 4 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. మంగళవారం 50లోపు షుగర్ లెవల్స్ పడిపోవడంతో జైలు అధికారులు ఆయనకు మెడిసిన్స్ ఇచ్చినట్లు వెల్లడించారు.

కాగా, ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు ఏప్రిల్ 1వ తేదీ సోమవారం కేజ్రీవాల్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపర్చారు.  కేసు దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదని.. తప్పించుకునే సమాధానలు చెబుతున్నారంటూ.. ఆయనను ఇంకా విచారించాల్సి ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సీఎం కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.   దీంతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. సీఎం హోదాలో తీహార్ జైలుకు వెళుతున్న మొదటి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు.