రేవంత్​, కిషన్​రెడ్డి సమైక్యవాదులతో కలిసిన్రు: హరీశ్​రావు ​

రేవంత్​, కిషన్​రెడ్డి సమైక్యవాదులతో కలిసిన్రు: హరీశ్​రావు ​

 

  • తెలంగాణ ఆత్మగౌరవాన్ని.. కుదువబెడ్తున్నరు.
  • రేవంత్​, కిషన్​రెడ్డి సమైక్యవాదులతో కలిసిన్రు: హరీశ్​
  • చంద్రబాబు శిష్యుడు రేవంత్​, కిరణ్​కుమార్​ శిష్యుడు కిషన్​రెడ్డి  
  • వాళ్ల మాటలు వింటే తెలంగాణ ఆగమైతది
  • ఆంధ్ర నాయకుల పెత్తనంలో కాంగ్రెస్​, బీజేపీ
  • అప్పుడు ఉద్యమం మీద, ఇప్పుడు రైతుల మీద కుట్రలు చేస్తున్నరని ఆరోపణ

గజ్వేల్, వెలుగు: సమైక్యవాదులను అడ్డుపెట్టుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదువ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డిపై మంత్రి హరీశ్​రావు ఫైర్​ అయ్యారు. -తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ కక్ష గట్టాయని ఆరోపించారు. రాష్ట్రానికి కేసీఆరే  రక్ష అని, -కేసీఆర్  పాలన పదేండ్లు కాదు పదేపదే  కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ‘‘చంద్రబాబు నాయుడు శిష్యుడు  రేవంత్ రెడ్డి,  కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు  కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డరు. వారి మాటలు వింటే తెలంగాణ ఆగమైతది” అని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం హరీశ్​రావు హోం మంత్రి మహమూద్​ అలీతో కలసి  సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వేలాదిమంది రైతుల చావుకు కారణమైందని,  మూడు గంటల కరెంటు చాలంటూ  రైతుల పాలిట కాంగ్రెస్  శాపంగా   మారిందని విమర్శించారు. ‘‘నల్లచట్టాలు తెచ్చిన బీజేపీకి, మూడు గంటల కరెంట్​ ఇస్తామన్న కాంగ్రెస్​కు రైతులు బుద్ధిచెప్తరు. తెలంగాణ ఏర్పడగానే చంద్రబాబు ప్రోద్బలం తో రేవంత్ రెడ్డి  ఎమ్మెల్యేలను కొని పసిగుడ్డు లాంటి  ప్రభుత్వాన్ని చంపాలని చూసిండు. -బీజేపీ వాళ్లు కూడా  ఎమ్మెల్యేలను  కొనాలనుకుని అడ్డంగా  దొరికిపోయిన్రు” అని ఆయన ఆరోపించారు. 

అవకాశం కోసం ఎదురుచూస్తున్నరు

తెలంగాణను అస్థిరపరిచేందుకు అవకాశం కోసం  ద్రోహులు ఎదురు చూస్తున్నారని హరీశ్​ దుయ్యబట్టారు. ‘‘అప్పట్లో ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించిన్రు.  ప్రస్తుతం పచ్చబడుతున్న రైతుల జీవితాల్లో  కరెంటు కల్లోలం రేపుతున్నరు. -ప్రతి పక్షంలో ఉండగానే మూడు గంటలు కరెంటు అన్న వారు పొరపాటున అధికారంలోకి వస్తే మూడు నిమిషాలు కూడా కరెంట్​ ఇవ్వరేమో” అని ఆయన అన్నారు.

 ముచ్చటగా మూడోసారి కేసీఆర్​ను గెలిపించుకోవాలని సూచించారు. ‘‘గత పదేండ్లలో ఏదీ ఆగలేదు. అభివృద్ధి వేగమైంది  తప్ప ఆగం కాలేదు” అని హరీశ్​ తెలిపారు. తెలంగాణ పోలీస్​ దేశంలోనే బెస్ట్​గా పేరుపొందిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా హైదరాబాద్​లో కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ను ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన సీసీ కెమెరాలు పెట్టామని ఆయన పేర్కొన్నారు.