వైద్యుల పనితీరు అద్భుతం.. వరల్డ్‌ డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు: మంత్రి హరీష్ రావు

వైద్యుల పనితీరు అద్భుతం.. వరల్డ్‌ డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు: మంత్రి హరీష్ రావు

ఆరోగ్య తెలంగాణ దిశగా వైద్యులు కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో వైద్యుల పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా కృషిచేసిన డాక్టర్లందరికీ.. వరల్డ్‌ డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని చెప్పారు. టీ-డయాగ్నొస్టిక్స్‌లో134 వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయన్నారు. హైదరాబాద్‌ కొండాపూర్‌ ప్రభుత్వ దవాఖాన నుంచి వర్చువల్‌గా 134 వైద్య పరీక్షలను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. అన్ని పీహెచ్‌సీల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమాన్ని చూడలేదని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో టీ-డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు, రేడియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. మరో రెండు జిల్లాల్లో వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తిచేస్తామన్నారు.