
హైదరాబాద్, వెలుగు : హంతకుడే సంతాపం తెలిపినట్టుగా కాంగ్రెస్‌నేత చిదంబరం తీరు ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చిదంబరం ప్రకటన చేసి వెనక్కి తీసుకోవడంతోనే యువకులు బలిదానం చేశారని మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పై చిదంబరం చేసిన వ్యాఖ్యలకు గురువారం ట్విట్టర్ వేదికగా ఆయన కౌంటర్ఇచ్చారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడడం చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అన్నట్టుగా ఉందన్నారు. అప్పటి నెహ్రూ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే ఆంధ్రా రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేస్తూ పొట్టి శ్రీరాములు చనిపోయారన్నారు. చరిత్ర తెలియకుండా చిదంబరం వక్ర భాష్యాలు చెప్తున్నారన్నారు. అప్పట్లో మద్రాస్రాష్ట్రంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేదని ఆయన మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
హైదరాబాద్ స్టేట్‌గా ఉండేదన్న విషయాన్ని ఆయన మర్చిపోయారన్నారు. రాష్ట్ర అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ బాగుందన్నారు. ఆర్బీఐ నివేదికలు ఏం చెప్తున్నాయో ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. ఒక్క చాన్స్ఇవ్వండని చిదంబరం అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.
ఆయనకు దమ్ముంటే సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, ఎంత మంది వచ్చి దుష్ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌వైపే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను దీవించబోతున్నారని తెలిపారు.
యువత బలిదానాలకు కాంగ్రెస్‌దే బాధ్యత : కేటీఆర్
1952 నుంచి 2014 వరకు వందలాది మంది తెలంగాణ యువత బలిదానాలకు కాంగ్రెస్‌పార్టీదే బాధ్యతని బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విట్టర్(ఎక్స్)లో కాంగ్రెస్‌నేత చిదంబరంకు కౌంటర్ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎంత కష్టపడినా తెలంగాణ ప్రజలు తమపై జరిగిన దౌర్జన్యాలను ఎప్పటికీ మరిచిపోలేరని పేర్కొన్నారు.