కాంగ్రెస్‌ను గెలిపించి రిస్క్​ తీసుకోవద్దు : మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్‌ను గెలిపించి రిస్క్​ తీసుకోవద్దు : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు: జనరంజక పాలనను అందిస్తున్న బీఆర్ఎస్ కే ప్రజలు మద్దతివ్వాలని కాంగ్రెస్ ను గెలిపించి రిస్క్ తీసుకోవద్దని మంత్రి హరీశ్​రావు కోరారు. శుక్రవారం రాత్రి  నంగునూరులో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు.  కరోనా  కష్ట కాలంలో మీకు అందుబాటులో ఉండడమే కాకుండా  కిట్లు,  వాక్సిన్ లు అందించి  మిమ్మల్ని కాపాడుకున్నానని గుర్తు చేశారు. నియోజకవర్గంలో సర్కారు ఆస్పత్రులు బాగు చేసుకోవడమే కాకుండా  మోకాలి చిప్పల మార్పిడి, డయాలసిస్, ఐసీయూ వంటి సౌకర్యాలు కల్పించుకున్నామని వివరించారు.

గతంలో చదువుల కోసం మన పిల్లలు వరంగల్, కరీంనగర్, హైదరాబాదుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని,  ఇప్పుడు ఏ చదువు కావాలన్నా సిద్ధిపేట దాటి పోవాల్సిన అవసరం లేకుండా చేసుకున్నామన్నారు. నంగునూరు మండలంలో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోందని,  మిగిలిన  25 శాతం రుణమాఫీని  త్వరలో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇండ్ల మంజూరు  విషయంలో కొంత అసంతృప్తి ఉందని,  దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పక్కా ఇల్లు కట్టించుకుందామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని, కాంగ్రెసోళ్లను నమ్మితే కరెంటు విషయంలో తిప్పలు పడతమని అన్నారు.