
హైదరాబాద్, వెలుగు: కొత్త మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటళ్ల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. హెల్త్ సెక్రటరీ రిజ్వీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి మంత్రి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. కొత్త కాలేజీలు నిర్మిస్తున్న జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్య, ఆర్‌అండ్‌బీ అధికారులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హరీశ్ అన్నారు. ఈసారి కొత్తగా 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. మెడికల్ కాలేజీల నిర్మాణం స్పీడ్‌గా జరగాలని, నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారం బిల్డింగ్‌ల నిర్మాణం ఉండాలని సూచించారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కాలేజీల నిర్మాణ పనుల్లో పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలన్నీ త్వరగా పూర్తి చేయడానికి ప్రతి కాలేజీకి ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారిని ఏర్పాటు చేయాలని టీఎస్‌ఐఐసీ, ఆర్‌అండ్‌బీ అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఎన్‌సీ(ఇంజనీర్ ఇన్ చీఫ్) గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.