రేషన్ షాపుల్లో కంటి వెలుగు టైం టేబుల్ పెట్టాలి
పంచాయతీ ఆఫీసుల్లోనూ ఏర్పాటు చేయాలి: హరీశ్‌రావు
మంత్రులు, అధికారులతో సమీక్ష
హైదరాబాద్, వెలుగు : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి టైం టేబుల్ బోర్డులను ఊర్లు, పట్టణాల్లోని రేషన్ షాపులు, పంచాయతీ ఆఫీసుల్లో ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమంపై మంగళవారం ఆయన మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్, జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కంటి వెలుగు క్యాంపుల వివరాల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. పంచాయతీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా రెండో విడత కంటి వెలుగు క్యాంపులను ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరం ఉన్నోళ్లందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు చేస్తామని తెలిపారు.
క్యాంపులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఉంటాయని, ఒక్కో క్యాంపులో ఒక మెడికల్ ఆఫీసర్, 8 మంది సిబ్బంది పనిచేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందని చెప్పారు. 12లోగా అన్ని జిల్లాల్లోనూ మంత్రులు కంటి వెలుగు సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్లాన్ చేసుకోవాలని, అదనపు బృందాలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 1 శాతం బఫర్ టీమ్ (అడ్వాన్స్ టీమ్)లు పెట్టుకోవాలన్నారు. సిబ్బందికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పీహెచ్‌సీల్లో కొత్తగా 929 మంది డాక్టర్లను నియమించామని, ఇతర ఆరోగ్య సేవలకు కంటి వెలుగుతో ఎలాంటి ఆటంకం ఉండబోదని చెప్పారు.