రాజకీయాలు చేసేందుకే రాష్ట్రానికి కేంద్రమంత్రులు వస్తున్నారా..?

రాజకీయాలు చేసేందుకే రాష్ట్రానికి కేంద్రమంత్రులు వస్తున్నారా..?

హైదరాబాద్ : బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో ఒక నీతి, రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ కాలేజీల విషయంలో ఒక నీతి అన్నట్టుగా కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకే దేశంలో ఉన్న మెడికల్ కాలేజీల విషయంలో ద్వంద్వ పద్ధతి సరికాదన్నారు. NMC నిబంధనలు ఎయిమ్స్ కు ఎందుకు వర్తించవు..? అని ప్రశ్నించారు. వైద్య విద్య విషయంలో కేంద్రానికి ఒక పాలసీ, రాష్ట్రాలకు ఒక పాలసీ ఎందుకన్నారు. ప్రొఫెసర్లు లేకుండానే ఎయిమ్స్ లో ఆపరేషన్ థియేటర్ లు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే కేంద్రమంత్రులు నిమ్స్ ఆస్పత్రిని చూసి.. ఆ తర్వాత బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని కూడా విజిట్ చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. భువనగిరి ఆస్పత్రిలో విద్యార్థులకు ట్రైనింగ్ కు అనుమతి ఇచ్చామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎయిమ్స్ నిర్మాణానికి 200 ఎకరాల భూమి, రూ.200 కోట్ల విలువైన భవనాలను ఉచితంగా అందించామన్నారు. రూ.500 కోట్ల ఆస్తిని ఇస్తే రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఎయిమ్స్ ఏర్పాటు చేసి మూడేళ్లు అయినా ఇప్పటికీ సరైన వసతులు ఏర్పాటు చేయలేదన్నారు. వైద్యుల మనోస్థైర్యం దెబ్బతీసేలా కేంద్ర మంత్రులు మాట్లాడటం తగదన్నారు. 

కేంద్రమంత్రులు రాజకీయం చేయడానికి రాష్ట్రానికి వస్తున్నారా..? లేక అభివృద్ధి కోసం వస్తున్నారా..? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని ముందుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ‘కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఉట్టి చేతులతో రావొద్దు. తెలంగాణకు ఏదైనా ఇచ్చి వెళ్లండి. లేదా తెలంగాణను చూసి నేర్చుకొని వెళ్లండి. మీ రాష్ట్రాల్లో రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ఉన్నాయా..?  రాష్ట్రానికి వారానికి ఒకసారి వచ్చే కేంద్ర మంత్రులు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి నేర్చుకోండి. లేదా మీ శాఖల పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులైనా పూర్తి చేయండి’ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు విషయంలో కేంద్రం ద్వంద వైఖరి ఎందుకు అవలంబిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ పై విద్వేషాలు పెంచుకోకుండా..  పరిపాలనపై దృష్టి సారించాలన్నారు. గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. రూరల్ డెవలప్ మెంట్ అవార్డ్స్ లో రాష్ట్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. తాము అభివృద్ధి పనులు చేయకపోతే ఇన్ని అవార్డులు ఎలా వచ్చాయన్నారు. కేంద్రమంత్రులు దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 

పీడియాట్రిక్ సర్జరీ, మెటర్నిటీ విభాగాల్లో కొత్తగా ఐసీయూలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గాంధీలో నూతన కాన్ఫెరెన్స్ హాల్ ను ప్రారంభించారు. ఆస్పత్రికి సంబంధించిన పోర్టల్ ను కూడా ఓపెన్ చేశారు. ఈ మధ్యే ఆస్పత్రిలో 500 పడకలు పెంచామన్నారు. వైద్యులను రాత్రి సమయాల్లోనూ విధులు నిర్వహించాలని చెప్పామని, షిఫ్ట్ ల వారీగా డ్యూటీలు చేయాలని చెప్పామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలు ఉండాలన్నారు. అత్యవసర చికిత్సల కోసం 200 బెడ్స్ తో పాటు ప్రత్యేకంగా ఐసీయూ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీలో ఉన్న అన్ని చికిత్సలకు కూడా ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ లో వైద్యసేవలు అందిస్తామని చెప్పారు. గాంధీలో హై ఎండ్ కిచెన్ రాబోతుందని, ఇప్పటికే ENT విభాగం కూడా ఏర్పాటైందన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు సర్జరీ చేస్తున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.15 లక్షల వరకూ ఖర్చువుతుందన్నారు. 

కరోనా సమయంలో గాంధీ సిబ్బంది చేసిన సేవలు అద్భుతమన్నారు. MRI యంత్రం ద్వారా 3,4 నెలల్లో 1400 స్కానింగ్ లు జరిగాయన్నారు. కోటి విలువైన సేవలు ఉచితంగా అందాయన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాల ఏర్పాటుతో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య తగ్గిందన్నారు.  ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. శానిటైజేషన్ సరిగా లేదని తమకు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని మరింత మెరుగు పరుస్తామన్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా వైద్యారోగ్య రంగానికి ఎక్కువ నిధులు ఖర్చు పెడుతున్నామన్నారు.