
రాత్రి వేళ్లలోనూ పోస్టుమార్టం : మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు : రాత్రి సమయంలోనూ పోస్టుమార్టం జరిగేలా చూడాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అలాగే, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు ఉచితంగా మందులు ఇచ్చి పంపాలని, ఈ విషయం పేషెంట్లకు తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. టీచింగ్ హాస్పిటల్స్‌పై మంగళవారం మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో రివ్యూ చేశారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలని, అవయవ దానాన్ని ప్రోత్సహించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం వైద్యానికి, వైద్య విద్యకు హబ్‌గా మారిందని తెలిపారు. గతేడాదిలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇప్పటికే కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం మెడికల్ కాలేజీలకు అనుమతులొచ్చాయన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, మొదటి స్థానంలోకి వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
త్వరలో 1,442 అసిస్టెంట్ పోస్టుల భర్తీ..
వైద్య రంగాన్ని పటిష్టం చేసేందుకు అడిగినవన్ని సీఎం కేసీఆర్ ఇస్తున్నారని హరీశ్‌రావు చెప్పారు. కొత్తగా 65 మందికి ప్రొఫెసర్లుగా ప్రమోషన్స్ ఇచ్చారన్నారు. 210 అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్లు త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ లాంటివి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 800 మంది పీజీ ఎస్ఆర్‌లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు కేటాయించామని తెలిపారు.