పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం..ప్రజా పాలనను ప్రజలు పెద్దఎత్తున దీవిస్తున్నారు

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం..ప్రజా పాలనను ప్రజలు పెద్దఎత్తున దీవిస్తున్నారు
  • విజన్‌‌ డాక్యుమెంట్‌‌తో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 85 శాతం స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌‌ ప్రభంజనం సృష్టిస్తోందని, ఇందిరమ్మ ప్రజా పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు పెద్దఎత్తున దీవిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం నిర్వహించిన సర్పంచ్‌‌ల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఎవరు సర్పంచ్‌‌లుగా గెలిచినా ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని, అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల విజయంలో కాంగ్రెస్‌‌ కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. దేశంలోనే అతి ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించిందని, అభివృద్ధి చెందిన గుజరాత్‌‌ వంటి రాష్ట్రాలు కూడా తెలంగాణతో పోటీపడే పరిస్థితి లేదన్నారు. నదులకు ఎక్కడ ఆనకట్టలు కట్టాలి, ఏ ప్రాంతంలో రోడ్లు వేయాలి, ఏ ప్రాంతంలో బుల్లెట్‌‌ ట్రైన్లు నడపాలి, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఫార్మా, ఐటీ పార్కులు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని విజన్‌‌ డాక్యుమెంట్‌‌ 2047లో వివరించామన్నారు. 2047 కల్లా త్రీ ట్రిలియన్‌‌ డాలర్ల ఎకానమీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. విజన్‌‌ డాక్యుమెంట్‌‌ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రతి సర్పంచ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా.. ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. సర్పంచ్‌‌లు స్కూళ్లను సందర్శించి, బోధన ఎలా జరుగుతుంది, వసతి సౌకర్యాలు ఉన్నాయో లేదో సమీక్షించాలని చెప్పారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తనకు నేరుగా ఫోన్‌‌ చేయవచ్చన్నారు. కాంగ్రెస్‌‌ మధిర మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిశోర్‌‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, దొండపాటి వెంకటేశ్వరరావు, బండారు నరసింహారావు, నూతి సత్యనారాయణ పాల్గొన్నారు.