ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేసేందుకే మహాత్మా గాంధీ పేరు తొలగించారు : ఎంపీ చామల

ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేసేందుకే  మహాత్మా గాంధీ పేరు తొలగించారు : ఎంపీ చామల
  •     కేంద్రంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేసేందుకే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకం పేరును కేంద్రం మార్చిందని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఆర్ఎస్ఎస్ – బీజేపీ కుఠిల ఆలోచనకు నిదర్శనమని విమర్శించారు. కేంద్రం, రాష్ట్ర నిధుల వాటా 40:60గా మార్చడంతో రాష్ట్రాలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

రాష్ట్రాల్లో నిధులు లేకపోతే పథకం అమలు కష్టమయ్యే పరిస్థితి ఉందని తెలిపారు.125 రోజులు అంటూనే ఉపాధి హామీని అస్పష్టంగా మార్చారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకానికి దేవుడి పేరు పెట్టి ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం తీరును ఆయన ఎండగట్టారు. 

మహాత్మా గాంధీ పేరును చరిత్ర నుంచి తొలగించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు. ఈ పథకం పేరుతోపాటు అమలులోకి తీసుకు వచ్చిన మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ దిగుతుందని చామల స్పష్టం చేశారు.