యావత్ జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారు

యావత్ జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారు

సిద్దిపేట: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముస్తాబాద్ సర్కిల్‌లోని జయశంకర్ విగ్రహానికి ఆర్థికమంత్రి హరీష్ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవింతాంతం పాటుపడ్డారని మంత్రి హరీష్ రావు కొనియాడారు. ‘రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారు. జయశంకర్ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌న చేసిన సూచ‌న‌లు, స‌ల‌హాలు భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు. జ‌యశంకర్ సార్ ఆజ‌న్మాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారు. యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో అగ్ర‌భాగాన నిల‌వ‌డానికి స్ఫూర్తిగా జ‌య‌శంక‌ర్ సార్ నిలుస్తున్నారు. జ‌య‌శంక‌ర్ సార్, న‌డుస్తున్న తెలంగాణ చారిత్ర‌క గ్రంథంగా ఉండేవారు. ఆయన జీవితం యువ‌త‌కు ఆద‌ర్శం, స్ఫూర్తి దాయకం’ అని మంత్రి హరీష్ అన్నారు.