కేసీఆర్ ముందుచూపు వల్లే యాసంగికి నీళ్లు

కేసీఆర్ ముందుచూపు వల్లే యాసంగికి నీళ్లు

సిద్ధిపేట: సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే యాసంగికి నీళ్లు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిన్నకోడూర్ మండలం, చందలపూర్ గ్రామ పరిధిలోని రంగనాయక సాగర్ ద్వారా యాసంగి పంటకు హరీశ్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. సీఎం జన్మదినం సందర్భంగా మొట్టమొదటిసారి యాసంగి పంటకు ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ గడ్డ మీద పుట్టి స్వరాష్ట్రాన్ని సాధించి.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇక్కడకు గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ గారి జన్మధన్యం అయ్యిందన్నారు.

‘ఈ ప్రాంత ప్రజలకు గోదావరి నీళ్లు ఒక కల. ఆ కలను సీఎం కేసీఆర్ నిజం చేశారు. ఈ యాసంగిలో ఒక్క మడి కూడా ఎండకుండా సాగు నీరు అందిస్తాం. గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో సాగునీటి వెతలకు కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారు. ఎండాకాలం వచ్చిందంటే రైతుల శ్రమ, డబ్బు బోరు పొక్కల్లో పోయేది. రాష్ట్ర చరిత్రలో యాసంగిలో ఏనాడు కూడా 20 లక్షల ఎకరాలకు మించేది కాదు. కానీ ఈ యాసంగిలో 50 లక్షల ఎకరాలు జిల్లాలో సాగులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ద్వారా నీళ్లు తేవడం వల్లనే ఇది సాధ్యమైంది. ఒకనాడు తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థితి నుంచి కేసీఆర్ ముందుచూపుతో యాసంగి పంటకు నీళ్లు ఇచ్చే స్థితికి చేరుకున్నాం. ఇది సిద్ధిపేట ప్రాంత ప్రజల అదృష్టం’ అని హరీశ్ పేర్కొన్నారు.