ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయం : మంత్రి హరీష్ రావు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయం : మంత్రి హరీష్ రావు

ఆగస్టు నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశంలో వైద్యారోగ్య శాఖ చేస్తున్న కృషి వల్ల 2014లో 30 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు, రెట్టింపు కంటే ఎక్కువ జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనం అన్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యధికంగా నారాయణ్ పేట్ 89 శాతం, ములుగు 87శాతం, మెదక్ 86, భద్రాద్రి కొత్తగూడెం 84 శాతం, వికారాబాద్ 83, గద్వాల్ 85 శాతం డెలివరీలు చేసి.. మంచి పనితీరు కనబర్చాయని అభినందించారు.

అతి తక్కువగా ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు అవుతున్న మంచిర్యాల (63), నిర్మల్ (66), మేడ్చల్, కరీంనగర్ (67) జిల్లాల్లో పనితీరు మెరుగుపడాలన్నారు మంత్రి హరీష్ రావు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ స్కోర్ విషయంలో మొదటి స్థానాల్లో నిలిచిన మెదక్ (84.4), జోగులాంబ గద్వాల్ (83.9), వికారాబాద్ (81), ములుగు (79), నాగర్ కర్నూల్ (77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానంలో ఉన్న జగిత్యాల, కుమ్రంభీం, నారాయణ్ పేట్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. 

ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు మంగళవారం (సెప్టెంబర్ 5న) టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస రావు, అన్ని జిల్లాల డీఎంహెచ్ వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

క్షేత్ర స్థాయిలో ఉంటూ ప్రాథమిక స్థాయి వైద్యం అందిస్తూ, ప్రజలను రోగాల బారి నుంచి కాపాడటంలో పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రోగాన్ని ముందుగా గుర్తించి, చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడుతున్నట్లు చెప్పారు. ఆశా, ఏఎన్ఎంల సేవలు గుర్తించిన సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. 

మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్స్, అమ్మఒడి వాహనాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక రోగాలు, ఇతర క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న గర్బిణులు గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ సేవలు పొందేలా చూడాలన్నారు. వందశాతం ఇమ్యునైజేషన్ జరిగేలా చూడాలన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా అన్ని రకాల పరీక్షలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. 

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి...
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. గర్బిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా డెలివరీ డేట్ తెలుసుకొని ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలన్నారు. 102, 108 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. పాముకాటు, కుక్కకాటు మందులను అన్ని పిహెచ్ సీ సెంటర్లలో అందుబాటులో ఉంచామని, ఎక్కడా లేవు అనే మాట రావొద్దన్నారు.

సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, జిల్లా వైద్యాధికారులు పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. జిల్లా స్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మలేరియా, డెంగీ కేసులు నమోదైతే తక్షణం వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. అవసరమైన చోట ఓపీ సేవలు పెంచాలని, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సేవలందించాలన్నారు.