మాది ఓటు బంధం కాదు పేగు బంధం : మంత్రి హరీశ్ రావు

మాది ఓటు బంధం కాదు పేగు బంధం : మంత్రి హరీశ్ రావు

జహీరాబాద్, వెలుగు: తమ పార్టీది ఓటు బంధం కాదని, పేగు బంధమని అందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా సాయం చేశారని మంత్రి హరీశ్​రావు అన్నారు. సోమవారం ఝరాసంఘం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ,  జహీరాబాద్ లో లింగాయత్ సమాజ్, మైనార్టీలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రైతుల పొట్ట కొట్టేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందని విమర్శించారు.

రైతుబంధు చెల్లింపులపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయడం వల్ల  నోటి వరకు వచ్చిన ముద్దను కాంగ్రెస్ తినకుండా చేసిందన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎన్నికలు పూర్తయిన తర్వాత  రైతుబంధు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతో పాటుపడ్డారన్నారు. రాహుల్, ప్రియాంకాలు తెలంగాణలో కాదు కర్నాటకలో ఆరు గ్యారంటీలపై ప్రచారం చేయాలని ఎద్దేవాచేశారు. కార్యక్రమంలో  జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్, ఎమ్మెల్యే మానిక్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఐడీసీ చైర్మన్లు నరోత్తం, తన్వీర్, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ మల్కాపురం శివకుమార్, ఎన్నికల ఇన్‌చార్జి దేవి ప్రసాద్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పటేల్ పాల్గొన్నారు.

సిద్దిపేట ప్రజలే మా బలం

సిద్దిపేట రూరల్: సిద్దిపేట ప్రజలే మా బలం బలగం అని మంత్రి హరీశ్ రావు భార్య శ్రీనిత రావు అన్నారు. సోమవారం ఆమె నారాయణరావుపేట మండల కేంద్రంతోపాటు, గుర్రాల గొంది, జక్కాపూర్, సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త కార్యక్రమం ఏదైనా గానీ వెంటనే సిద్దిపేటలో ప్రారంభించాలని ఆలోచించే నాయకుడు మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ  ఎన్నికల్లో హరీశ్​రావుకు లక్షా యాబై వేల మెజారిటీ ఇవ్వాలని కోరారు.